Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ప్రయాణం ప్రారంభం.. ఫాల్కన్ 9 టేకాఫ్ సక్సెస్.. వీడియో ఇదిగో!

Shubhanshu Shuklas space journey begins with successful Falcon 9 launch
  • అంతరిక్షంలోకి మామిడి తాండ్ర, పెసరపప్పు హల్వా, క్యారెట్ హల్వా తీసుకెళ్లిన శుక్లా
  • 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు
  • సూక్ష్మ గురుత్వాకర్షణలో మెంతి, పెసర వంటి విత్తనాలు మొలకెత్తే తీరుపై అధ్యయనం
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది.. మన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ టేకాఫ్ విజయవంతమైంది. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములతో ఫాల్కన్ రాకెట్ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. మధ్యాహ్నం 12:01 గంటలకు రాకెట్ టేకాఫ్ అయింది. దాదాపు 28 గంటల పాటు జరగనున్న ఈ ప్రయాణం రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంతరిక్ష కేంద్రానికి రాకెట్ అనుసంధానంతో ముగుస్తుంది. శుభాంశు శుక్లా బృందం 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేయనుంది.

ఈ చారిత్రక యాక్సియమ్-4 మిషన్ ద్వారా భారత్, పోలాండ్, హంగేరీ దేశాలు 40 ఏళ్లకు పైగా విరామం తర్వాత మానవసహిత అంతరిక్ష యాత్రలను పునఃప్రారంభించాయి. ఈ మూడు దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకేసారి మిషన్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. శుభాంశు శుక్లా తన 14 రోజుల అంతరిక్ష పర్యటనలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఇస్రో-డీబీటీ స్పేస్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద మెంతి, పెసర వంటి భారతీయ ఆహార ధాన్యాల విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణలో ఎలా మొలకెత్తుతాయో అధ్యయనం చేస్తారు. ఈ విత్తనాలను తిరిగి భూమికి తీసుకొచ్చి, వాటి మనుగడ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.

దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు, భవిష్యత్తులో అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడే బయో-రీజెనరేటివ్ వ్యవస్థల రూపకల్పనపై కూడా శుక్లా పరిశోధనలు చేస్తారు. నాసా హ్యూమన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా వ్యోమగాముల ఆరోగ్యం, సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారడం వంటి ఐదు సంయుక్త అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. తనతో పాటు మామిడి తాండ్ర, పెసరపప్పు హల్వా, క్యారెట్ హల్వా వంటి భారతీయ వంటకాలను ఆయన అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. 
Shubhanshu Shukla
Falcon 9
SpaceX
Kennedy Space Center
Indian astronaut
Space mission
International Space Station
Space travel

More Telugu News