Kavitha: కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: కవిత

Kavitha Slams Revanth Reddy Says KCR Made Him CM
  • ఆరు గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్ కు కవిత సవాల్
  • మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ
  • గోదావరి జలాలను చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ గా ఇచ్చారని విమర్శ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. ఇదే సమయంలో, పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు.

గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపై కవిత స్పందిస్తూ... "యస్.. అసెంబ్లీలో కచ్చితంగా చర్చిద్దాం. అయితే, ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలి" అని డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమని, ఆయన మరింత హుందాగా వ్యవహరించాలని సూచించారు.

చంద్రబాబును రేవంత్ పిలిచి హైదరాబాద్ బిర్యానీ తినిపించి, గోదావరి నీళ్లను కానుకగా ఇచ్చారని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం పరిపాటిగా మారిందని, 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం తలపెట్టరని కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ సంతకంతో కూడిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారని కవిత గుర్తు చేశారు. సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ల మొత్తాన్ని పెంచేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వేలాది పోస్టుకార్డులను సోనియా గాంధీకి పంపుతున్నామని తెలిపారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?" అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని కవిత పేర్కొన్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
Revanth Reddy
Telangana
BRS
Congress
Sonia Gandhi
Pension Scheme
Assembly Elections
Godavari River

More Telugu News