Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై సీనియర్ నటుడు సత్యరాజ్ తీవ్ర వ్యాఖ్యలు

Sathyaraj Warns Pawan Kalyan on Tamil Nadu Politics
  • మధురైలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ విమర్శలు
  • దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు తగవన్న సత్యరాజ్
  • మతంతో ఓట్లు దండుకోవాలని చూస్తే కుదరదని వ్యాఖ్య
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ప్రముఖ తమిళ సినీ నటుడు సత్యరాజ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు పొందాలనుకునే ప్రయత్నాలు తమిళ గడ్డపై ఫలించవని సత్యరాజ్ తేల్చిచెప్పారు.

ఇటీవల పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో జరిగిన "మురుగన్ మానాడు" సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నాస్తికులు, సెక్యులరిస్టులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకే పార్టీని విమర్శించడంతో పాటు, హిందువులు, సనాతన ధర్మం అంటూ తన పాత వాదనలను మరోసారి వినిపించారు. "నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే నాస్తికులు హిందువుల‌ను ఎంచుకుని లక్ష్యంగా చేసుకుంటున్నారు" అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. ఆయన మతం పేరిట తమిళనాట చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఇప్పటికే పలువురు మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నటుడు సత్యరాజ్ కూడా పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. "దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం" అంటూ పవన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

"పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరు. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశామని అనుకుంటే అది మీ తెలివితక్కువతనమే అవుతుంది. తమిళ ప్రజలు చాలా తెలివైనవారు. తమిళనాట మీ ఆటలు సాగవు" అని సత్యరాజ్ విమర్శించారు. దేవుడి పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే తమిళ ప్రజలు తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు.
Pawan Kalyan
Sathyaraj
Tamil Nadu Politics
Murugan Maanadu
DMK Party
Periyar
Hinduism
Sanatana Dharma
Madurai

More Telugu News