Chandrababu Naidu: గత ఐదేళ్ల పాలనను మర్చిపోండి.. భయాలకు తావులేదు: పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు

Chandrababu Naidu urges industrialists forget past fears at meeting
  • వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తామన్న ముఖ్యమంత్రి
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి
  • టెక్నాలజీతో సుపరిపాలన, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్న ముఖ్యమంత్రి
  • సంపద సృష్టి ద్వారా పేదలకు సంక్షేమం అందించడమే ధ్యేయమన్న చంద్రబాబు
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు నెలకొల్పే పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన వివరించారు.

గత ఐదేళ్ల పాలన తాలూకు చేదు అనుభవాలను పెట్టుబడిదారులు మరిచిపోవాలని, ఇకపై అలాంటి భయాలకు తావులేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించేలా నూతన విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు.

"ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పెట్టుబడులు పెట్టండి. రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, హైటెక్ పరిశ్రమలకు అనువుగా ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు గూగుల్ వంటి సంస్థలు రానున్నాయి, విశాఖ కేంద్రంగా సీ-కేబుల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి వివరించారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని, అమరావతి పరిసరాల్లో కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం వ్యాలీ, ఇన్నోవేషన్స్‌పై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి జరగాలని, ఆ సంపదను పేదలకు సంక్షేమ రూపంలో అందించి, పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడమే తన లక్ష్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఐటీతో అభివృద్ధికి బాటలు వేశామని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించామని చెప్పారు. టెక్నాలజీ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఆయన అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చి, సామాజిక బాధ్యతగా పేదలకు సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Investments
FICCI
Industrialists
Rayalaseema

More Telugu News