Ramachander: స్టేషన్ బెయిల్‌కి లంచం డిమాండ్ .. ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి రెండో ఎస్ఐ

Ramachander SI Caught by ACB Taking Bribe for Station Bail
  • స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.20వేల లంచం డిమాండ్ చేసిన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ రెండో ఎస్ఐ రామచందర్
  • ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు 
  • లంచంగా పది వేలు తీసుకున్న వెంటనే ఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఒక కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య, అతని సోదరుడి మధ్య నెలకొన్న భూ వివాదంపై ఈ నెల 23న కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుడు వెంకటయ్యకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రామచందర్ జి. రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాధితుడు స్టేషన్ ఆవరణలో ఎస్సై రామచందర్‌కు రూ.10 వేలు ఇవ్వగా, ఆయన ఆ డబ్బును జేబులో పెట్టుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి వద్ద నుండి ఎస్సై తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన నిందితుడు ఎస్సై రామచందర్ జి.ని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సీహెచ్. బాలకృష్ణ తెలిపారు. మరో 11 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఎస్సై రామచందర్ గత ఏడాది మార్చి 22న బదిలీపై కల్వకుర్తికి వచ్చారు.

కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ తెలంగాణ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందించాలని తెలంగాణ ఏసీబీ విజ్ఞప్తి చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయాలని, అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ నెంబర్ 9440446106, ఫేస్ బుక్ (@telanganaACB), వెబ్ సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొంది. ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించింది. 
Ramachander
Kalwakurthy
Nagar Kurnool
ACB
bribe
corruption
SI
police
Telangana ACB
station bail

More Telugu News