Rinku Singh: టీమిండియా బ్యాటర్ రింకూసింగ్‌‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం!

Rinku Singh Likely to Become Basic Education Officer in Uttar Pradesh
  • జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ అధికారిగా నియామకంపై చర్చ
  • అంతర్జాతీయ పతక విజేతల కోటాలో అవకాశం
  • నవంబర్ 19న జరగాల్సిన రింకూ సింగ్ వివాహం వాయిదా
  • క్రికెట్ కమిట్‌మెంట్ల వల్లే పెళ్లి తేదీ మార్పు
  • 2026 ఫిబ్రవరిలో పెళ్లికి సన్నాహాలు
భారత క్రికెట్ జట్టు యువ బ్యాటర్ రింకూసింగ్ త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రింకూను ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖలో అధికారిగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఆయన వివాహం కూడా వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రింకూసింగ్‌ను జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ అధికారి (బీఎస్ఏ)గా నియమించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందని తెలుస్తోంది. దేశానికి క్రీడల్లో విశేష సేవలందించిన క్రీడాకారులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేందుకు ఉద్దేశించిన 'అంతర్జాతీయ పతక విజేతల ప్రత్యక్ష నియామక నిబంధనలు 2022' కింద ఈ నియామకం జరగనున్నట్టు సమాచారం. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని, ప్రాథమిక విద్యాశాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించిందని తెలిసింది.

పెళ్లికి త్వరలోనే కొత్త తేదీ ప్రకటన
మరోవైపు, రింకూ సింగ్-సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివాహం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వీరి పెళ్లి నవంబర్ 19న జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్టు తెలుస్తోంది. రింకూ సింగ్‌కు నవంబర్‌లో ఉన్న క్రికెట్ మ్యాచ్‌ల కారణంగానే ఈ వివాహాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఇరు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు సమాచారం. పెళ్లిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నారని, కచ్చితమైన తేదీని త్వరలో వెల్లడిస్తారని సమాచారం.

ఈ నెల ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో రింకూసింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, నటి జయా బచ్చన్, భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ వంటి వారు ఉన్నారు. కాగా, వీరి వివాహం కోసం వారణాసిలోని తాజ్ హోటల్‌ను బుక్ చేశారు. అయితే, పెళ్లి వాయిదా పడటంతో ఇప్పుడు దానిని రద్దు చేసి ఫిబ్రవరి నెలాఖరుకు బుక్ చేసినట్టు తెలిసింది. 
Rinku Singh
Indian Cricketer
Priya Saroj
Uttar Pradesh Government
Cricket
Basic Education Officer
Akhilesh Yadav
Yogi Adityanath
Samajwadi Party
Lucknow

More Telugu News