Kannappa Movie: రివ్యూలు చేసేటప్పుడు జాగ్రత్త.. కన్నప్ప టీమ్ వార్నింగ్

Kannappa Team Warns Reviewers Against Malicious Reviews
  • ఉద్దేశపూర్వకంగా సినిమాపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు
  • ఢిల్లీ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు వెల్లడి
  • సోషల్ మీడియాలో పబ్లిక్ కాషన్ నోటీస్ జారీ చేసిన మేకర్స్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ విమర్శకులు, రివ్యూయర్లు, మీమర్స్ లకు చిత్ర బృందం హెచ్చరికలు జారీ చేసింది. సినిమాపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు తమ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందినట్లు ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ వెల్లడించింది.

‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో, శ్రీకాళహస్తి క్షేత్ర పురాణం తెలిసిన వారి నుంచి, ఆలయ పూజారుల నుంచి వ్రాతపూర్వక అనుమతులు స్వీకరించామన్నారు. సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొంది, గ్రాఫిక్స్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, విడుదల తేదీని కూడా మార్చి, అత్యుత్తమ అవుట్‌పుట్ కోసం ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

అయినప్పటికీ, తమ కుటుంబంపై కొందరికి ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా సినిమాను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని భావించిన చిత్ర బృందం, ఈ విషయంలో కోర్టును ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రతిష్ఠను దెబ్బతీసేలా, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తప్పవని, ఈ విషయమై తాము తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ కాషన్ నోటీస్‌ను కూడా విడుదల చేసింది.

సినిమాను చూసి, వాస్తవాల ఆధారంగా తమ అభిప్రాయాలను పంచుకోవాలని, అంతేగానీ వ్యక్తిగత ద్వేషంతో, పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే న్యాయపరమైన మార్గాలను అనుసరిస్తామని చిత్ర బృందం తెలిపింది. గతంలో కేరళలో ఓ నిర్మాత ఇలాంటి చర్యలు తీసుకున్న ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమాపై దుష్ప్రచారం చేసేవారిని నిలువరించేందుకే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ‘కన్నప్ప’ టీమ్ స్పష్టం చేసింది.

Kannappa Movie
Manchu Vishnu
Kannappa
Telugu Movie Review
Movie Critics
Delhi High Court
Srikalahasti Temple
Public Caution Notice
Movie Release
Film Criticism

More Telugu News