RTC Conductor: చిల్లర గొడవ.. వృద్ధుడిపై చేయి చేసుకున్న మహిళా కండక్టర్

RTC Conductor Assaults Elderly Passenger Over Change Issue in Krishna District
  • తోట్లవల్లూరులో ఉయ్యూరు డిపో బస్సులో ఘటన
  • ప్రయాణికుడిని బస్సు దింపి కొడుతున్న వీడియో వైరల్
  • కండక్టర్ పై గతంలోనూ దురుసు ప్రవర్తన ఆరోపణలు
  • ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న ఆర్టీసీ డీఎం
ప్రయాణికుడిపై ఆర్టీసీ మహిళా కండక్టర్ దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. చిల్లర విషయంలో తలెత్తిన చిన్న వివాదం, వృద్ధుడిపై చేయి చేసుకునే వరకు వెళ్లింది. తోట్లవల్లూరులో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
తోట్లవల్లూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు అనే వృద్ధుడు ఉయ్యూరు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. టికెట్ కోసం ఆయన కండక్టర్‌కు రూ. 200 నోటు ఇవ్వగా.. చిల్లర లేదని, పెద్ద నోటు ఇస్తే ఎలాగని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.

ఈ గొడవతో ఆగ్రహానికి గురైన మహిళా కండక్టర్, తోట్లవల్లూరు కనకదుర్గ కాలనీ వద్ద బస్సును ఆపి మల్లిఖార్జునరావును కిందకు దింపేశారు. నన్నే దుర్భాషలాడతావా అంటూ ఆయనపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

కాగా, సదరు మహిళా కండక్టర్ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఆమెపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ, విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన మచిలీపట్నం ఆర్టీసీ డీఎం, ఉయ్యూరు డిపో ఇన్‌ఛార్జి డీఎం పెద్దిరాజు ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుడిపై దాడి చేయడం తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు.
RTC Conductor
Andhra Pradesh RTC
Krishna District
Bus Conductor Assault
Passenger Dispute
Totlavalluru
Challange Issue
Old man Assault
Viral Video
APSRTC

More Telugu News