Renjarla Viyan: రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. 41 సెకన్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లు!

Renjarla Viyan sets world record at 2 years old
  • రెండేళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన నిజామాబాద్ చిన్నారి వియాన్
  • 41 సెకన్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పి అబ్బురపరిచిన బుడ‌త‌డు
  • ప్రతిభను గుర్తించి వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన సంస్థ
  • ఏడాది వయసు నుంచే తల్లి అమూల్య ప్రత్యేకంగా శిక్షణ
మాటలు కూడా ఇంకా పూర్తిగా రాని వయసులో ఓ రెండేళ్ల బాలుడు తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 41 సెకన్ల వ్యవధిలో మన దేశంలోని 29 రాష్ట్రాల రాజధానుల పేర్లను చకచకా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ చిన్నారి ప్రతిభకు గుర్తింపుగా ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు దక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్‌లోని సీతరాంనగర్ కాలనీలో నివసించే రవికుమార్, అమూల్య దంపతుల కుమారుడు రెంజర్లవార్ వియాన్ (2) ఈ ఘనతను సాధించాడు. వియాన్ తండ్రి రవికుమార్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి అమూల్య గృహిణి. ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ మనవడే ఈ వియాన్.

వియాన్‌కు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచే తల్లి అమూల్య రాష్ట్రాల రాజధానుల పేర్లను సరదాగా నేర్పించడం ప్రారంభించారు. తల్లి ప్రోత్సాహంతో ఆ బాలుడు అనతికాలంలోనే అన్ని రాష్ట్రాల రాజధానులను గుర్తుపెట్టుకుని, ఎవరు అడిగినా తడుముకోకుండా చెప్పే స్థాయికి చేరుకున్నాడు.

ఈ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’ సంస్థ ప్రతినిధులు గత మే నెలలో నిజామాబాద్‌కు స్వయంగా వచ్చారు. వియాన్ ప్రతిభను ప్రత్యక్షంగా పరీక్షించి ఆశ్చర్యపోయారు. వారి ఎదుట కేవలం 41 సెకన్లలోనే 29 రాజధానుల పేర్లను బాలుడు చెప్పడంతో వారు రికార్డుకు ఎంపిక చేశారు. 

ఇందుకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రం గురువారం తమకు అందిందని వియాన్ తల్లిదండ్రులు ఆనందంగా తెలిపారు. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సాధించిన వియాన్‌ను, అతడిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Renjarla Viyan
Viyan
World Wide Book of Records
Indian states capitals
Nizamabad
Young achiever
Memory skills
Record holder
Telangana
Kids achievements

More Telugu News