Mysaa: యోధురాలిగా రష్మిక సరికొత్త అవతారం.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ అదుర్స్!

Rashmika Mandanna as warrior in Mysaa first look
  • రష్మిక మందన్న కొత్త పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ 
  • యోధురాలిగా సరికొత్త అవతారంలో నేషనల్ క్రష్
  • ఐదు భాషల్లో రానున్న ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం
  • మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రలో రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో వేగం పెంచారు. ఇటీవలే ‘కుబేర’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అందాల భామ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘మైసా’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహించనుండగా, అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ‘మైసా’ విడుదల కానుంది. చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో రష్మిక యోధురాలిగా, అత్యంత భయంకరమైన అవతారంలో కనిపించారు. ‘‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’ అనే శక్తివంతమైన వ్యాఖ్యను పోస్టర్‌కు జోడించి మేక‌ర్స్‌ సినిమాపై అంచనాలను పెంచారు.

ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి రష్మిక స్పందిస్తూ... ‘‘నేను ఎప్పుడూ కొత్తదనం, వైవిధ్యం ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తాను. ‘మైసా’ అలాంటి చిత్రమే. ఇది నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర, అడుగుపెట్టని ప్రపంచం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే’’ అని ఆమె తెలిపారు.

ఇక‌, ప్రస్తుతం రష్మిక కెరీర్ విజయవంతంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన ‘కుబేర’ చిత్రం కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ఆమె విజయాల జాబితాలో చేరింది. ప్రస్తుతం ఆమె లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియేంటేడ్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’లో నటిస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘థామా’ అనే అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఇప్పుడు ‘మైసా’ ప్రకటనతో ఆమె ఖాతాలో మరో భారీ చిత్రం చేరినట్లయింది.
Mysaa
Rashmika Mandanna
Rashmika Maisa
Ravindra Pulle
Pan India movie
Telugu movies
The Girlfriend movie
Ayushmann Khurrana
Thama movie
Kubera movie

More Telugu News