Harish Rao: విషయం లేనందువల్లే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

Harish Rao Slams Revanth Reddy Over Banakacherla Project
  • బనకచర్ల అంశాన్ని రేవంత్ పక్కన పెడుతున్నారన్న హరీశ్
  • బనకచర్లపై కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్
  • ప్రభుత్వం స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న హరీశ్
బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) పేరుతో సీఎం కేవలం కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పీపీటీ కేవలం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కోసమే ఇచ్చారని, ఇది ఓ నాటకమని మండిపడ్డారు.

2016 నాటి అజెండా మినిట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఆనాటి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కేవలం ఇరు రాష్ట్రాలు కూర్చుని ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని మాత్రమే అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ ప్రతిపాదననూ ఒప్పుకునేది లేదని కేసీఆర్ ఆనాడే స్పష్టం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో, బనకచర్ల విషయంపై జరగబోయే కేంద్ర జలశక్తి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తన వాదనలను బలంగా వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

విషయం లేనందువల్లే సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. "బేసిన్‌కు, బాసిన్‌కు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి" అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసిందని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బనకచర్ల కార్పొరేషన్ ఏర్పాటు కాలేదని, టెండర్లు కూడా పిలవలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదంలో బీజేపీ తీరును కూడా హరీశ్ తప్పుబట్టారు. "చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా" బీజేపీ నేతల వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నష్టం జరగకముందే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జోక్యం చేసుకుని బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే, బనకచర్ల ప్రాజెక్టు వల్ల నష్టపోయే రైతులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Harish Rao
Revanth Reddy
Banakacherla project
Telangana
KCR
BRS
Congress
Telangana politics
Irrigation project
Krishna River

More Telugu News