Sunnam Cheruvu: మాదాపూర్ సున్నం చెరువుపై విస్తుపోయే విషయాలు.. ప్రజలకు హైడ్రా హెచ్చరిక

Sunnam Cheruvu Water Dangerously Polluted in Madhapur
  • హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో భారీగా సీసం కాలుష్యం
  • పరిమితికి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు హైడ్రా అధ్యయనంలో వెల్లడి
  • చెరువు నీటిని నిత్యావసరాలకు కూడా వాడొద్దని తీవ్ర హెచ్చరిక
  • ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు కూడా అత్యంత ప్రమాదకరం
  • నగరంలోని ఆరు చెరువుల పునరుద్ధరణలో భాగంగా సర్వే
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌‌లో గల సున్నం చెరువు నీరు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ చెరువు నీటిలో పరిమితికి మించి ఏకంగా 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు తేలింది.

హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రధాన చెరువుల పునరుద్ధరణకు 'హైడ్రా' నడుం బిగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సున్నం చెరువుపై దృష్టి సారించింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సహకారంతో చెరువులోని నీటి నమూనాలను సేకరించి, శాస్త్రీయంగా పరీక్షించింది. ఈ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి.

హైడ్రా నివేదిక ప్రకారం, సున్నం చెరువు నీరు తీవ్రంగా కలుషితమైంది. ముఖ్యంగా, మనుషుల ఆరోగ్యానికి అత్యంత హానికరమైన సీసం (లెడ్) పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నీటిని తాగవద్దని, కనీసం రోజువారీ అవసరాలకు కూడా వినియోగించవద్దని హైడ్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. చెరువు నీటి వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నీటిలో సీసం 12 రెట్లు, కాడ్మియం రెండు నుంచి మూడు రెట్లు, నికెల్ రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. సహజంగా నీటిని మరగబెట్టి తాగమంటారు. కానీ ఇక్కడి నీటిని మరగబెట్టి తాగినా ప్రయోజనం లేదని హైడ్రా హెచ్చరించింది. చెరువుల పునరుద్ధరణలో సున్నం చెరువుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.
Sunnam Cheruvu
Hyderabad lakes
Madhapur lake
Lake pollution
Lead contamination

More Telugu News