Mohan Yadav: ముఖ్యమంత్రికే షాకిచ్చిన పెట్రోల్ బంకు! ఆగిపోయిన కాన్వాయ్‌లోని 19 కార్లు... ఎందుకంటే?

Mohan Yadav Convoys Cars Breakdown Due to Adulterated Diesel
  • ముఖ్యమంత్రి కాన్వాయ్‌కే కల్తీ డీజిల్.. మధ్యప్రదేశ్‌లో బంక్ సీజ్
  • డీజిల్‌కు బదులు నీళ్లు.. మార్గమధ్యంలో నిలిచిన సీఎం కాన్వాయ్
  • అధికారుల చర్యలు
మధ్యప్రదేశ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కే కల్తీ డీజిల్ సరఫరా కావడంతో, కాన్వాయ్‌లోని దాదాపు 19 వాహనాలు మార్గమధ్యంలోనే ఆగిపోయాయి. ఈ ఘటనతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డీజిల్ ట్యాంకుల్లో నీరు ఉన్నట్లు గుర్తించి విస్తుపోయారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం రాత్రి రాట్లాంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా దోసిగావ్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్‌లో కాన్వాయ్‌లోని వాహనాలకు డీజిల్ నింపారు. అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణించగానే, కాన్వాయ్‌లోని వాహనాలు ఒక్కొక్కటిగా మొరాయించాయి.

మొత్తం 19 కార్లు ముందుకు కదలకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కాన్వాయ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది వాహనాలను రోడ్డు పక్కకు తరలించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగిపోయిందన్న సమాచారం అందుకున్న స్థానిక యంత్రాంగం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. వాహనాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకునేందుకు తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో వాహనాల డీజిల్ ట్యాంకులను తెరిచి చూడగా సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ట్యాంకుల్లో డీజిల్‌కు బదులుగా నీరు కనిపించింది. వాహనాల్లో నింపిన ఇంధనాన్ని బయటకు తీసి పరిశీలించగా, అందులో సగానికి పైగా నీరు కలిపినట్లు తేలింది. డీజిల్ కల్తీ జరిగిందని నిర్ధారించుకున్న అధికారులు వెంటనే సంబంధిత పెట్రోల్ బంక్‌పై దృష్టి సారించారు.

అధికారులు ఆ పెట్రోల్ బంక్‌ను తనిఖీ చేయగా అదే సమయంలో అక్కడ డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. దీంతో కల్తీ జరిగిందని నిర్ధారణ కావడంతో అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇండోర్ నుంచి మరో వాహనశ్రేణిని రప్పించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Mohan Yadav
Madhya Pradesh
petrol pump
adulterated diesel
convoy
car breakdown

More Telugu News