Seethakka: మావోయిస్టుల ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందన

Seethakka Responds to Maoist Warning
  • మావోల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి
  • జీవో 49ను తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని స్పష్టం
  • ఆదివాసుల జోలికి వెళ్లొద్దని అటవీ అధికారులకు ఆదేశాలిచ్చామన్న సీతక్క
ఆదివాసీల హక్కుల విషయంలో మావోయిస్టులు చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. తన మూలాలను తాను ఎన్నడూ మరచిపోలేదని, ఆదివాసీల పక్షాన నిలబడతానని ఆమె స్పష్టం చేశారు. ములుగులో విలేకరులతో మాట్లాడిన ఆమె, మావోయిస్టులు తనపై చేసిన విమర్శలను ఖండించారు. ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలని మావోయిస్టులకు పరోక్షంగా హితవు పలికారు.

వివాదాస్పదంగా మారిన జీవో నంబర్ 49ను తాను వ్యతిరేకించిన విషయాన్ని మంత్రి సీతక్క గుర్తుచేశారు. "ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే జీవో 49ను నేను వ్యతిరేకించాను. ఈ విషయంపై మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించాను. అడవిలో ఆదివాసుల జోలికి వెళ్లవద్దని, వారిని ఇబ్బంది పెట్టవద్దని నేను, మరో మంత్రి కొండా సురేఖ కలిసి అటవీశాఖ అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం" అని ఆమె వివరించారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అధికారులు మాత్రమే నిబంధనలు అతిక్రమిస్తున్నారని, మిగతా వారెవరూ ఆదివాసీలను ఇబ్బంది పెట్టడం లేదని ఆమె తెలిపారు.

అంతకుముందు, మావోయిస్టులు మంత్రి సీతక్కకు ఒక లేఖ రాశారు. ఒకప్పుడు ఉద్యమంలో పనిచేసిన సీతక్క, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉండి ఆదివాసీల హక్కులను గాలికొదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కుల ఉల్లంఘనకు ఆమెదే పూర్తి బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, కుమురం భీమ్ జిల్లాలో 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం జీవో 49ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవోను రూపొందించారని విమర్శించారు. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లేఖపై మంత్రి సీతక్క వెంటనే స్పందించి తన వైఖరిని స్పష్టం చేశారు. 
Seethakka
Telangana Minister Seethakka
Maoists warning
Adivasi rights
Kumuram Bheem district
GO 49
Konda Surekha
Telangana government
Naxalites

More Telugu News