KTR: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ప్రారంభానికి ముందే కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR Tweet on Hyderabad New Flyover Before Inauguration
  • శనివారం గచ్చిబౌలి-కొండాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభం
  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఫ్లైఓవర్‌కు కాంగ్రెస్ నేత పీజేఆర్ పేరు ఖరారు
  • ఇది తమ ప్రభుత్వ ఘనతేనన్న మాజీ మంత్రి కేటీఆర్
  • ఎస్ఆర్డీపీ కింద 36 ఫ్లైఓవర్లు మేమే కట్టామన్న కేటీఆర్
  • మిగిలినవి పూర్తి చేయాలంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఈ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్‌ను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు, ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫ్లైఓవర్ నిర్మాణం క్రెడిట్ తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నామకరణం

శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న ఈ ఫ్లైఓవర్‌కు, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి. జనార్ధన్ రెడ్డి గౌరవార్థం "పీజేఆర్ ఫ్లైఓవర్"గా నామకరణం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇది మా ప్రభుత్వ ఘనత: కేటీఆర్

ఈ ఫ్లైఓవర్ ప్రారంభంపై కేటీఆర్ తన 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద నిర్మించిన మరో కీలక ప్రాజెక్టు అందుబాటులోకి రావడం గర్వంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పౌరుల తరఫున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు 42 ఫ్లైఓవర్లకు ప్రణాళికలు రూపొందించామని, వాటిలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. మరో 6 ప్రాజెక్టులు 2024 నాటికి పూర్తి కావాల్సిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. "మిగిలిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వారి పాలనాకాలం పూర్తయ్యేలోపు అయినా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ఎద్దేవా చేశారు.
KTR
KTR flyover
Hyderabad flyover
PJR flyover
Revanth Reddy
Gachibowli
Kondapur
SRDP
BRS government
Telangana

More Telugu News