Abhishek: తిరుమలలో నాట్య ప్రదర్శనలు చేయిస్తానంటూ కళాకారులకు శఠగోపం!

Abhishek Cheated Artists in Tirumala Dance Performance Scam
  • తిరుమలలో శ్రీ శ్రీనివాస కళార్చన పేరుతో కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ సంస్థ నిర్వాహకుడు
  • నిర్వాహకుడి మోసంపై నిరసన వ్యక్తం చేసిన కళాకారులు
  • నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు
తిరుమలలో నృత్య కళాకారులతో అరంగేట్రం చేయిస్తామని చెప్పి ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసగించిన ఘటన వెలుగు చూసింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు సంస్థ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ, అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్న తెలంగాణలోని ఖాజీపేటకు చెందిన అభిషేక్.. శ్రీ శ్రీనివాస కళార్చన పేరుతో తిరుమలలోని ఆస్థాన మండపంలో కళాకారులచే నృత్య ప్రదర్శన, అరంగేట్రం, కళా ప్రదర్శనలు ఇప్పిస్తామని చెప్పి ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేసి వారి నృత్య ప్రదర్శనకు సమయం, తేదీ నిర్ణయించి ఒక లేఖ, గుర్తింపు కార్డు ఇచ్చాడు. ఈ ప్రదర్శనకు సంబంధించి ఈ నెల 21న టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వద్ద నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే నిర్వాహకుడు అభిషేక్ కళాకారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ హెచ్‌డీపీపీకి ఫిర్యాదులు రావడంతో, ప్రదర్శనను నిలుపుదల చేస్తూ టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సదరు సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రదర్శనను నిలుపుదల చేయాలని ఆదేశించారు.

టీటీడీ నిర్ణయంపై నిర్వహకుడు అభిషేక్ హైకోర్టును ఆశ్రయించడంతో, కళాకారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడంతో సంస్థ అనుమతులు రద్దు చేశామని న్యాయస్థానానికి టీటీడీ తరపు న్యాయవాదులు వివరించారు. అయితే, ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమం కావడంతో టీటీడీ సదరు సంస్థకు అనుమతి ఇవ్వాలని, సంస్థ నిర్వహకుడి అక్రమాలపై టీటీడీ విజిలెన్స్‌తో విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు టీటీడీ ఈ నెల 27, 28 తేదీల్లో రోజుకు 600 మంది చొప్పున 1200 మందికి ఆస్థాన మండపంలో నృత్య ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సంస్థ దాదాపు 2 వేల మంది నుంచి నగదు వసూలు చేసి టీటీడీ అనుమతించిన దాని కంటే అధికంగా నృత్య కళాకారులకు ఆహ్వానం పంపింది. దీంతో వారందరూ తిరుమల ఆస్థాన మండపం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం టీటీడీ 600 మందినే అనుమతించి మిగిలిన వారిని బయట నిలిపివేశారు.

దాంతో తాము సంస్థ నిర్వాహకుడి చేతిలో మోసపోయామని, కళాకారులను గుర్తించి అనుమతించాలని నిన్న నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని కళాకారులతో చర్చించి సమస్యను టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారుల ఆదేశాలతో మిగిలిన కళాకారులను ప్రదర్శనకు అనుమతించారు. అలానే బాధితుల ఫిర్యాదుతో సంస్థ నిర్వాహకుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 
Abhishek
Tirumala
TTD
Dance performances
Hindu Dharma Prachara Parishad
Annamacharya Arts Academy
Scam
Khajipet
Andhra Pradesh
Court Order

More Telugu News