Jonnalagadda Padmavathi: వైసీపీ ముఖ్య కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు గైర్హాజరు

Jonnalagadda Padmavathi Absent from Key YSRCP Event
  • బుక్కరాయ సముద్రంలో అట్టహాసంగా శింగనమల నియోజకవర్గ వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం
  • కార్యక్రమానికి హజరైన వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి
  • కార్యక్రమానికి మాజీ నియోజకవర్గ సమన్వయకర్తలు దూరం
వైసీపీ శింగనమల నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం నిన్న బుక్కరాయసముద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నేతలందరూ హాజరయ్యారు.

అయితే, గత ఎన్నికల వరకు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త, ప్రభుత్వ విద్యాశాఖ మాజీ సలహాదారు సాంబశివారెడ్డితో పాటు వైసీపీ మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వారు పార్టీ ముఖ్య కార్యక్రమానికి దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన సాకే శైలజానాథ్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఇక నియోజకవర్గంలో తమకు రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని భావించి వీరు ఈ ముఖ్య కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

జొన్నలగడ్డ పద్మావతి 2014లో వైసీపీలో చేరి నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశారు. 2014 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యామిని బాల చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మేలుకొలుపు పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై 46 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో పద్మావతి గెలుపొందారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి వైసీపీ టికెట్ ఇవ్వకుండా ఎం. వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చింది. వీరాంజనేయులు టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై 10 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో పార్టీ పద్మావతి, వీరాంజనేయులులను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది. 
Jonnalagadda Padmavathi
Singanamala
YSRCP
Sakke Sailajanath
Andhra Pradesh Politics
Veeranjaneyulu
Sajjala Ramakrishna Reddy
Peddireddy Mithun Reddy

More Telugu News