Nagarjuna: 'ఎన్ కన్వెన్షన్' తొలగించాక నాగార్జున ప్రభుత్వానికి 2 ఎకరాలు అప్పగించారు!: రేవంత్ రెడ్డి కితాబు

Nagarjuna Donated Land After N Convention Demolition Revanth Reddy Appreciates
  • హైదరాబాద్ అభివృద్ధి ఆగదన్న రేవంత్ రెడ్డి
  • కంచ గచ్చిబౌలి అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత
  • కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ
  • ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా అభివృద్ధి యజ్ఞం ఆగదన్న ముఖ్యమంత్రి
  • కాలుష్య నియంత్రణకు 3 వేల ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు నిర్ణయం
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రభుత్వం తొలగించగా, ఆ తర్వాత ఆయన స్వయంగా స్పందించి చెరువుకు ఆనుకొని ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి నగర అభివృద్ధికి నిజమైన హీరోగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. 

శనివారం నాడు పీజేఆర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఎలాంటి ఆటంకాలనైనా అధిగమిస్తామని, కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నా అవి తాత్కాలికమేనని, వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఆయన అన్నారు. కంచ గచ్చిబౌలిలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా దివంగత నేత పీజేఆర్ సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలను తీసుకురావడంలో పీజేఆర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. హైటెక్ సిటీ ఏర్పాటుకు పునాది వేసింది కూడా పీజేఆర్ అని అన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేయగా, చంద్రబాబు దానిని మరో స్థాయికి తీసుకెళ్లారని గుర్తు చేశారు.

ప్రపంచ నగరాలతో పోటీ

హైదరాబాద్ నగరం న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడాలని ఆకాంక్షించారు. 'రైజింగ్ తెలంగాణ-2047' లక్ష్య సాధన కోసం తమ ప్రభుత్వం ఒక యజ్ఞంలా పనిచేస్తోందని, దీనికి ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా వెనుకాడేది లేదని ఆయన అన్నారు. ఈ లక్ష్య సాధనలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్ ప్రణాళికలు.. కాలుష్య నియంత్రణ

భవిష్యత్ హైదరాబాద్ కోసం తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఢిల్లీలో కాలుష్యం, చెన్నైలో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల నుంచి పాఠాలు నేర్చుకొని హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు. ఇందులో భాగంగా నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

నగరంలో వరద ముంపునకు నాలాలు, చెరువుల కబ్జాలే ప్రధాన కారణమని ముఖ్యమంత్రి విమర్శించారు. బతుకమ్మకుంటను కొందరు బీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తే తమ ప్రభుత్వం దానిని విడిపించిందని గుర్తు చేశారు. కేవలం అక్రమ నిర్మాణాలను మాత్రమే 'హైడ్రా' ద్వారా కూల్చివేసినట్లు స్పష్టం చేశారు.

భారత్ ఫ్యూచర్ సిటీ.. నియోజకవర్గాల పునర్విభజన

హైదరాబాద్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే 30 వేల ఎకరాల్లో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2029లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో శేరిలింగంపల్లి వంటి పెద్ద నియోజకవర్గాలు నాలుగుగా విడిపోయే అవకాశం ఉందని, దీనివల్ల అందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం లభిస్తుందని సీఎం వివరించారు.
Nagarjuna
Akkineni Nagarjuna
Revanth Reddy
N Convention
Telangana

More Telugu News