Ketireddy Pedda Reddy: తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్.. కేతిరెడ్డిని అడ్డుకున్న జేసీ వర్గం.. భారీగా మోహరించిన బలగాలు

Tadipatri Tension JC Group Blocks Ketireddy Arrival
  • తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు
  • తన నివాసానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • అడ్డుకునేందుకు యత్నించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ శ్రేణులు
  • ఇరువర్గాల నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు.

ఈ ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కేతిరెడ్డిని పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు ఆయన ఇంటి వైపు బయలుదేరారు. అదే సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

దీంతో కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేతిరెడ్డి ఇంటి వైపు వెళ్తున్న టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తమ వాహనంలో ఎక్కించుకుని అనంతపురానికి తరలించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలకారణమని తెలుస్తోంది. తాను ఎన్నికల్లో గెలిచినా, ఓడిపోయినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజాన్ని కొనసాగిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వబోమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.
Ketireddy Pedda Reddy
Tadipatri
JC Prabhakar Reddy
Anantapur
TDP
YCP
Political tensions
Andhra Pradesh politics
Factionalism
Assembly elections

More Telugu News