RS Praveen Kumar: చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శనాస్త్రాలు

RS Praveen Kumar Criticizes Chandrababu Over Double Standards
  • కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారు, చంద్రబాబులా దొడ్డిదారిలో రాలేదన్న ప్రవీణ్ కుమార్
  • కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
  • ఇప్పుడు మహా న్యూస్‌పై దాడిని ఖండిస్తూ నేతల గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేటీఆర్ విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోలా వ్యవహరిస్తూ తమ రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మహా న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపణలు రాగానే ఖండనలు గుప్పిస్తున్న నేతలు, గతంలో జరిగిన ఘటనలను ఎందుకు విస్మరించారని ఆయన నిలదీశారు.

“బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చంద్రబాబులా దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడి, ఇప్పటికీ ఉద్యమ సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆయన” అని అన్నారు. అలాంటి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహా న్యూస్ అభ్యంతరకర థంబ్‌నెయిల్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు.

గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ, నేతల తీరును ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. “గతంలో టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ మీడియా సంస్థపై దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మహా న్యూస్‌పై దాడి జరిగిందని తెలియగానే పవన్ కల్యాణ్, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీపీఐ నేతలు ఖండిస్తున్నామని అరవడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకో న్యాయం, కేటీఆర్‌కో న్యాయమా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

అసెంబ్లీలో తన భార్యను వైసీపీ నేత కొడాలి నాని దుర్భాషలాడారని ఆరోపిస్తూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని, ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన విషయాన్ని ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. “తన కుటుంబం విషయంలో అంతలా స్పందించిన చంద్రబాబు, కేటీఆర్ వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని నిలదీశారు. 
RS Praveen Kumar
Chandrababu Naidu
KTR
BRS
Janasena
Pawan Kalyan
Andhra Pradesh Politics
Telangana Politics
Mahaa News
Political Criticism

More Telugu News