Nara Lokesh: మనం ఆ తప్పు చేయకూడదు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Warns TDP Cadre Against Complacency
  • అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా పనిచేయాలని శ్రేణులకు పిలుపు
  • వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక
  • కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త కార్యక్రమం
  • సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం’ 
  • జులై 5 నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశం
అధికారం చేతికి వచ్చిందన్న అలసత్వం ప్రదర్శించవద్దని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ పతనాన్ని ఉదాహరణగా చూపుతూ, అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు 'సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "151 సీట్లు గెలిచిన పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందంటే దానికి వారి అహంకారమే ప్రధాన కారణం. మనం ఆ తప్పు చేయకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నట్లే ప్రజలతో మమేకమవ్వాలి. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగాలి" అని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో చారిత్రక విజయం వెనుక కార్యకర్తల అలుపెరగని శ్రమ ఉందని, కష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని నేతలకు సూచించారు.

ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు 'సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని ఆదేశించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఇచ్చిన మాట ప్రకారం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేశామని, ఇదే విధంగా ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జులై 5వ తేదీ నాటికి పార్టీ కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలని గడువు విధించారు. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయడంతో పాటు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని నొక్కిచెప్పారు. పార్టీని నాలుగు దశాబ్దాలుగా ముందుకు నడిపిన సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. "ప్రపంచమంతా తిరిగినా మనం తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయం లాంటి పార్టీ కార్యాలయానికే. గత పాలనలో అలాంటి కార్యాలయంపై దాడి జరిగినా పట్టించుకోని దుస్థితి చూశాం" అని ఆయన గుర్తుచేశారు. పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును సీరియస్‌గా తీసుకుని విజయవంతం చేయాలని, ఎక్కడ కూర్చోవాలో నిర్ణయించేది ప్రజలేనని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు.
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Chandra Babu Naidu
Governance
Welfare Schemes
Political Strategy
Party Cadre
Talli ki Vandanam

More Telugu News