Amit Shah: తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదు: అమిత్ షా

Amit Shah Slams Telangana Government Over Corruption
  • నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించిన అమిత్ షా
  • ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ  అంటూ విమర్శలు
  • బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ మౌనమెందుకు? అంటూ ప్రశ్న
"తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి మాత్రం పోలేదు. అధికారం మారింది, కానీ దోపిడీ తీరు మారలేదు!".. ఇది నిజామాబాద్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఘాటైన వ్యాఖ్య. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను ఢిల్లీ పెద్దల ఏటీఎంగా మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నిజామాబాద్ రైతుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, ఆదివారం జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్ షా, రైతులకు శుభవార్త చెబుతూనే, విపక్షాలపై రాజకీయ అస్త్రాలు సంధించారు. అదే వేదికపై నుంచి దేశంలోని నక్సలైట్లకు అంతిమ హెచ్చరిక జారీ చేశారు.

ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. "ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? ఎందుకంటే, వాళ్లూ వీళ్లూ దొందూ దొందే. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చుతోంది. తెలంగాణ సొమ్మును ఢిల్లీకి తరలించే ఏటీఎంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తోంది" అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన పోయి, ఇప్పుడు ఢిల్లీ కుటుంబ పాలన మొదలైందని ఎద్దేవా చేశారు.

నక్సలిజానికి డెడ్‌లైన్.. 2026 నాటికి అంతం!

నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అమిత్ షా స్పష్టం చేశారు. "ఇక సమయం లేదు. 2026 మార్చి 30 నాటికి దేశంలో నక్సలిజం అనే పదాన్ని భూస్థాపితం చేసి తీరుతాం. ఇది మోదీ గ్యారెంటీ" అని ఆయన ప్రకటించారు. "తుపాకులు పక్కనపెట్టి, హత్యలు ఆపి జనజీవన స్రవంతిలో కలవండి. లేదంటే, కఠిన చర్యలు తప్పవు" అని నక్సలైట్లకు తీవ్ర హెచ్చరికలు పంపారు. ఉగ్రవాదాన్ని ఎలాగైతే అణచివేశామో, నక్సలిజాన్ని కూడా కూకటివేళ్లతో పెకిలిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

రైతులకు 'పసుపు' కానుక

40 ఏళ్ల నిజామాబాద్ రైతుల పోరాటానికి ప్రధాని మోదీ ప్రభుత్వం ముగింపు పలికిందని అమిత్ షా అన్నారు. ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్, మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. "మోదీ ఏది చెబితే అది చేస్తారు. ఈ బోర్డుతో పాటు, భారత్ ఆర్గానిక్, భారత్ ఎక్స్‌పోర్ట్ సంస్థలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై నిజామాబాద్ పసుపు ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని చాటుతుంది. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది" అని ఆయన భరోసా ఇచ్చారు.


Amit Shah
Telangana
BRS
Corruption
Revanth Reddy
Nizamabad
Turmeric Board
Farmers
Naxalism
KCR

More Telugu News