Hafiz Gul Bahadur Group: ఆ దాడి మేం చేసిందే.. భారత్ పని కాదు.. పాకిస్థానీ తాలిబన్ గ్రూప్

Pakistan Taliban Group Claims Khyber Pakhtunkhwa Attack
  • పాకిస్థాన్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
  • 13 మంది సైనికులు మృతి.. 24 మందికి గాయాలు
  • దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాక్ సైన్యం తీవ్ర ఆరోపణ
  • తామే చేశామంటూ బాధ్యత ప్రకటించుకున్న పాకిస్థానీ తాలిబన్ గ్రూప్
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో భద్రతా బలగాల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనేనని పాకిస్థాన్ తాలిబన్ గ్రూప్ ప్రకటించంది. శనివారం జరిగిన ఈ దాడిలో 13 మంది సైనికులు కోల్పోయారు. 14 మంది పౌరులు సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దీని వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పాకిస్థానీ తాలిబన్లకు చెందిన ఓ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది.

అసలేం జరిగింది?
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మిర్ అలీ ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఆత్మాహుతి దళ సభ్యుడు ఒకరు కాన్వాయ్‌పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాన్వాయ్‌కు ముందున్న భద్రతా వాహనం అడ్డుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, పలువురు సైనికులు, పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

భారత్‌పై పాక్ ఆరోపణలు.. తిప్పికొట్టిన ఢిల్లీ
ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం (ఐఎస్పీఆర్) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఈ దాడి వెనుక కూడా భారత్ హస్తం ఉందని ఆరోపించింది. "భారత ప్రాయోజిత ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమికొట్టేందుకు మా సైన్యం కట్టుబడి ఉంది. మా సైనికులు, పౌరుల ప్రాణత్యాగాలు మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి" అని ఐఎస్పీఆర్ పేర్కొంది.

అయితే, పాకిస్థాన్ చేసిన ఈ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. "జూన్ 28న వజీరిస్థాన్‌లో జరిగిన దాడికి భారత్‌ను నిందిస్తూ పాకిస్థాన్ సైన్యం చేసిన ప్రకటనను మేము చూశాం. ఈ నిరాధార ఆరోపణలను తీవ్రంగా తిరస్కరిస్తున్నాం" అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

బాధ్యత స్వీకరించిన తాలిబన్ గ్రూప్
ఈ ఆరోపణలు, ఖండనల పర్వం కొనసాగుతుండగానే ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థానీ తాలిబన్ (టీటీపీ) అనుబంధ సంస్థ అయిన ‘హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్’ ప్రకటించుకుంది. దీంతో పాకిస్థాన్ ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. పాకిస్థాన్‌లోని తెహ్రిక్-ఇ-తాలిబన్ కంటే హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైనది కావడం గమనార్హం.

మరోవైపు, ఈ దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మాతృభూమి భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. "ఇలాంటి పిరికిపంద దాడులు దేశ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీయలేవు" అని జర్దారీ అన్నారు.
Hafiz Gul Bahadur Group
Pakistan
Taliban
Khyber Pakhtunkhwa
Terrorist Attack
Indian Foreign Ministry
Tehrik-i-Taliban Pakistan
Asif Ali Zardari
Waziristan

More Telugu News