Shine Tom Chacko: రోడ్డు ప్రమాదం అనుభవాన్ని వివరించిన విలన్ పాత్రల నటుడు

Shine Tom Chacko Recalls Horrific Road Accident Experience
  • ఆ ప్రమాద ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనన్న నటుడు షైన్ టామ్ చాకో
  • తండ్రి మరణాన్ని తాము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామన్న షైమ్ టామ్
  • ఓ యూట్యూర్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రమాద ఘటన విషయాలు వెల్లడి
మలయాళ నటుడు, 'దసరా' ఫేమ్ విలన్ షైన్ టామ్ చాకో తమ రోడ్డు ప్రమాద అనుభవాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇటీవల ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆయన తండ్రి సీపీ చాకో మృతి చెందగా, ఆయనతో సహా ఇతర కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు.

ఈ విషాదకర ఘటనపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షైన్ టామ్ చాకో స్పందించాడు. ఈ దుర్ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని, కళ్లు మూసి తెరిచే లోపు ప్రమాదం జరిగిపోయిందని ఆయన అన్నాడు.

ఆరోజు ఉదయం అమ్మా, నాన్న, సోదరుడు, తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. తాను వెనుక సీటులో కూర్చుని నిద్రపోతున్నానని, రెండు మూడు సార్లు మెలకువ రావడంతో నాన్నతో మాట్లాడుతూ మళ్లీ నిద్రపోయానని చెప్పారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి చూస్తే తమ కారు ప్రమాదానికి గురైందని ఆయన వివరించారు. ఆ సమయంలో తనకు ఏమీ అర్థం కాలేదని, తామంతా రోడ్డు మీద ఉన్నామనే విషయం కూడా తెలియలేదని అన్నారు.

తండ్రిని ఎన్నిసార్లు పిలిచినా ఆయన స్పందించలేదని, తల్లి షాక్‌కు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు రోడ్డు ప్రమాదాల గురించి వినడం, చూడటం జరిగిందని, కానీ తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నానని చెప్పారు. ఆ సమయంలో దయచేసి ఎవరైనా సాయం చేయండి, మమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్లండి అంటూ తాను వేడుకున్నానని షైన్ టామ్ చాకో తెలిపాడు.

ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తనకు పెద్దగా గుర్తులేదని ఆయన అన్నారు. ఆరోగ్యపరమైన కారణాల వల్ల తాను కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నానని, దానివల్ల ఎక్కువసేపు నిద్రలో ఉంటున్నానని తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు కూడా తాను ఆ మందులు తీసుకున్నానని, అందుకే ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన చెప్పారు.

ఆ ప్రమాదంలో తనకు గాయాలయ్యాయని, సుమారు 30 కుట్లు పడ్డాయని ఆయన తెలిపారు. తన తల్లి, సోదరుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారని అన్నారు. తండ్రి మరణాన్ని తాము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామంటూ షైన్ టామ్ చాకో భావోద్వేగానికి గురయ్యాడు. 
Shine Tom Chacko
Shine Tom Chacko accident
Road accident
Dasara villain
CP Chacko death
Malayalam actor
Car accident India
Kerala accident news
Accident interview

More Telugu News