Narayana: గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లింది: మంత్రి నారాయణ

Minister Narayana Alleges Misuse of Funds by Previous Government
  • గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు
  • మున్సిపల్ శాఖకు చెందిన రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపణ
  • రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని వ్యాఖ్య
  • నెల్లూరులో కాలువల పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి
గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, రూ.10 లక్షల కోట్ల అప్పులను ప్రజలపై మోపిందని ఆయన విమర్శించారు. సోమవారం నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ గాడిన పడుతున్నాయని అన్నారు. "గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లింది. రూ.పది లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి మిగిల్చి వెళ్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అనుభవంతో పరిస్థితులు గాడిన పడుతున్నాయి. వైసీసీ ఆపేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నాం" అని ఆయన తెలిపారు.

నెల్లూరు నగరంలో 6.7 కిలోమీటర్ల మేర ఉన్న కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించామని, రాబోయే 15 రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

అలాగే పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు సిద్ధం చేసిన వీఆర్ హైస్కూల్‌లో సోమవారం నుంచే తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పథంలో నిలుపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Narayana
Minister Narayana
Andhra Pradesh
Municipal Funds Misuse
Chandrababu Naidu
YCP Government
Andhra Pradesh Finances
Nellore
Drainage System
VR High School

More Telugu News