Pashamylaram Factory Blast: ఫ్యాక్టరీ పేలుడులో ఎనిమిది మంది మృతి.. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు!

Pashamylaram Factory Blast Kills Six Workers
  • ఫ్యాక్టరీలో చెల్లాచెదురుగా పడిపోయిన కార్మికులు
  • పేలుడు ధాటికి కుప్పకూలిన రియాక్టర్ షెడ్
  • శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు!
పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కార్మికులు చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు తీవ్రతకు రియాక్టర్ ఉన్న షెడ్డు మొత్తం కూలిపోయిందని, ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు.

దీంతో శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల్లో పలువురి  ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా, పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఘాటైన వాసనల కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ లోపల పరిస్థితి భయానకంగా ఉందని, ఎక్కడ చూసినా కార్మికులు పడిపోయి కనిపించారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చందానగర్‌, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పరిశీలించారు.

Pashamylaram Factory Blast
Factory Blast
Pashamylaram
Sangareddy
Telangana
Fire Accident
Industrial Accident
Chemical Factory
Workers Death

More Telugu News