PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ఖరారు చేసిన అధిష్ఠానం

PVN Madhav Appointed as AP BJP President
  • ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
  • రేపు విజయవాడలో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ
  • ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక ఎంపీ మోహన్ 
  • ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయమైంది.

అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్‌ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఇందులో భాగంగా పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

పీవీఎన్ మాధవ్‌కు పార్టీలో, అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన శాసన మండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) సేవలందించడమే కాకుండా, మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకుగా పనిచేసిన ఆయన, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం)లో కూడా పనిచేశారు.

మాధవ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి, దివంగత నేత చలపతిరావు బీజేపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. చలపతిరావు కూడా గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పీవీఎన్ మాధవ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.
PVN Madhav
AP BJP President
Andhra Pradesh BJP
BJP State President
Chalapathi Rao
BJP MLC
AP BJP Leadership Change
Andhra Pradesh Politics
BJP Vijayawada
RSS

More Telugu News