Sabitha Indra Reddy: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సబిత

Sabitha Indra Reddy Slams Congress Government
  • రాష్ట్రంలో ప్రణాళిక లేని పాలన సాగుతోందన్న సబిత
  • కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపణ
  • అధికారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తోందని, పార్టీ కండువా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తూ పక్షపాతం చూపుతోందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో తలాతోక లేని పాలన కొనసాగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్ 31వ డివిజన్‌లోని గ్రీన్‌రిచ్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని సబితా రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటోందని అన్నారు. అక్కడి అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అనవసర విషయాలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని, అధికారులను వేధించడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వంతో పోరాటం చేసైనా సరే నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తానని ఆమె స్థానికులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ సూర్ణగంటి అర్జున్, మాజీ కార్పొరేటర్లు పెద్దబావి శోభా ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, బోయపల్లి దీపికా శేఖర్‌రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. 
Sabitha Indra Reddy
Telangana politics
Congress government
Maheshwaram constituency
Revanth Reddy
Opposition MLAs
Development works
Indiramma houses
BRS party
Local issues

More Telugu News