Shefali Jariwala: షెఫాలీ జరివాలా మృతిపై డాక్టర్లు ఏమంటున్నారంటే..?

Shefali Jariwala Cardiac Arrest What Doctors Say
  • అందం కోసం ప్రాణాలతో చెలగాటం వద్దంటున్న నిపుణులు
  • ఫిట్‌గా ఉన్నా సరే హృద్రోగాలు.. కార్డియాలజిస్ట్ వెల్లడించిన షాకింగ్ నిజాలు
  • స్టెరాయిడ్లు, నిద్రలేమి, హార్మోన్ థెరపీలే యువత పాలిట యమపాశాలు
  • షెఫాలీ జరివాలా మరణం.. యువతలో గుండె జబ్బులపై పెరుగుతున్న ఆందోళన
కాంటా లగా ఫేమ్ షెఫాలీ జరివాలా కార్డియాక్ అరెస్ట్ తో అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. ఆరోగ్యంగా, ఫిట్ గా కనిపించిన షెఫాలీ హఠాత్తుగా కుప్పకూలడం, ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తున్న యువతలో పెరుగుతున్న హృద్రోగాలపై కార్డియాక్ నిపుణులు స్పందిస్తున్నారు. కేవలం ఫిట్‌నెస్ థెరపీలు, వర్కౌట్లు మాత్రమే గుండె ఆరోగ్యానికి సరిపోతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ధీరేంద్ర సింఘానియా కీలక విషయాలు వెల్లడించారు.

యువతలో హృద్రోగాలు..
యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో డాక్టర్ సింఘానియా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. యువతలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ముప్పునకు ప్రధాన కారణాలను ఆయన వివరించారు. డాక్టర్ సింఘానియా వెల్లడించిన వివరాల ప్రకారం.. స్టెరాయిడ్ల వాడకం, తీవ్రమైన నిద్రలేమి, మహిళల్లో హార్మోన్ థెరపీలు గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా శరీర నియమాలను పాటించకపోతే సమస్యలు తప్పవని ఆయన అన్నారు. సెలబ్రిటీలు ఫిట్‌గా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దాని కోసం వారు ఏం చేస్తారో మనకు తెలియదు. చాలామంది సెలబ్రిటీలు రాత్రంతా మేల్కొని ఉంటారు. నిద్రలేమి గుండెకు అత్యంత ప్రమాదకరమైన కారకంగా ఇప్పటికే నిరూపితమైందని ఆయన గుర్తుచేశారు.

స్టెరాయిడ్లు, డ్రగ్స్ తో ముప్పు..
శరీర సౌష్టవం కోసం వాడే స్టెరాయిడ్లు, డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడం, మహిళలు వాడే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ), గర్భనిరోధక మాత్రలు వంటివి గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని డాక్టర్ సింఘానియా హెచ్చరించారు. వీటికి తోడు, ఆధునిక జీవనశైలిలో భాగమైన తీవ్రమైన ఒత్తిడి, సోషల్ మీడియా వ్యసనం రక్తపోటును, కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయని, ఇవి చివరికి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఆయన వివరించారు. ఇటీవల గుండెపోటుకు గురై కోలుకున్న 36 ఏళ్ల యువకుడి కరోనరీ యాంజియోగ్రఫీని చూపిస్తూ, అతనికి పొగతాగడం, మద్యం సేవించడం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేనప్పటికీ గుండెపోటు వచ్చిందని ఆయన ఉదహరించారు.

షెఫాలీ మృతిపై విశ్లేషణ
షెఫాలీ జరివాలా మరణానికి కార్డియాక్ అరెస్టే గుండెపోటు కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే, కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టంలో తేలనుంది. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు షెఫాలీ నివాసాన్ని సందర్శించగా, అక్కడ చర్మ సౌందర్యం కోసం వాడే గ్లూటాథియోన్, విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ మాత్రలు లభించాయి. దీంతో పర్యవేక్షణ లేని యాంటీ-ఏజింగ్ చికిత్సలు ఆమె తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు..
ఈ విషయంపై డాక్టర్ సింఘానియా స్పందిస్తూ, "గ్లూటాథియోన్, విటమిన్ సి వంటివి గుండెపై నేరుగా దుష్ప్రభావం చూపవు. అవి గుండెకు హానికరం కాదు. కానీ, ఒకవేళ ఆమె యాంటీ-ఏజింగ్ కోసం ఏవైనా హార్మోనల్ థెరపీలు తీసుకుని ఉంటే, వాటి వల్ల దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది" అని అభిప్రాయపడ్డారు. షెఫాలీకి 15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఎపిలెప్సీకి వాడే మందుల వల్ల సాధారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండదని డాక్టర్ సింఘానియా స్పష్టం చేశారు.
Shefali Jariwala
Shefali Jariwala death
cardiac arrest
heart attack
Dr Dhirendra Singhania
heart disease in youth
steroids
hormone therapy
anti-aging injections
glutathione

More Telugu News