Abhishek Bachchan: ఐశ్వర్యరాయ్ తో విడాకులంటూ వస్తున్న వార్తలపై అభిషేక్ బచ్చన్ స్పందన

Abhishek Bachchan Reacts to Divorce Rumors with Aishwarya Rai
  • అసత్య ప్రచారాలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయని అభిషేక్ బచ్చన్ ఆవేదన
  • నెగెటివ్ వార్తలకే విలువనిస్తారని మండిపాటు
  • ఆన్‌లైన్‌లో విమర్శించే బదులు, దమ్ముంటే ముఖం మీద చెప్పాలని ట్రోల్స్‌కు సవాల్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ వైవాహిక జీవితం గురించి గత కొంతకాలంగా తీవ్రమైన ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నారంటూ దాదాపు ఏడాదిగా వార్తలు వస్తున్నప్పటికీ, ఈ జంట వాటిపై మౌనాన్నే ఆశ్రయించింది. అయితే, తాజాగా ఈ పుకార్లపై అభిషేక్ బచ్చన్ పెదవి విప్పారు. తన కుటుంబంపై ఇలాంటి అసత్య ప్రచారాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తూ, ఆన్‌లైన్ ట్రోల్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈటైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ, తనపై వచ్చే విమర్శలను గతంలో పెద్దగా పట్టించుకునేవాడిని కాదని, కానీ ఇప్పుడు కుటుంబం ఉన్నందున అవి తనను ఎంతో బాధిస్తున్నాయని అన్నారు. "ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వార్తలు చాలా బాధపెడతాయి. నేను ఏదైనా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా, దాన్ని కూడా వక్రీకరిస్తారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం. నా జీవితం మీరు జీవించడం లేదు. నేను ఎవరికైతే జవాబుదారీగా ఉండాలో, వారు మీరు కాదు" అని అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి నెగెటివ్ వార్తలు సృష్టించేవాళ్లు తమ మనస్సాక్షికే సమాధానం చెప్పుకోవాలని ఆయన అన్నారు. "ఇది కేవలం నా గురించే కాదు. ఇలాంటి వాటి వల్ల నేను ప్రభావితం కాను. ఇక్కడి వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కానీ ఇందులో కుటుంబాలు కూడా ఇమిడి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే కొత్త ఫ్యాషన్ నడుస్తోంది" అని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఒకసారి తన సోషల్ మీడియా పోస్ట్‌పై ట్రోల్ చేసిన ఒక దారుణమైన కామెంట్‌కు తన స్నేహితుడు సికిందర్ ఖేర్ తీవ్రంగా స్పందించాడని చెప్పారు. సికిందర్ తన ఇంటి అడ్రస్ పోస్ట్ చేసి, దమ్ముంటే అక్కడికి వచ్చి ఆ మాట ముఖం మీద చెప్పమని ఆ ట్రోల్‌కు సవాల్ విసిరాడని తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ వెనుక అజ్ఞాతంగా దాక్కుని ఇష్టం వచ్చినట్లు రాయడం చాలా సులభమని, కానీ ఆ మాటలు ఎదుటివారిని ఎంతగా బాధిస్తాయో గ్రహించాలని అన్నారు. "ఎంతటి వారైనా సరే, ఇలాంటివి బాధపెడతాయి. అదే మీ విషయంలో జరిగితే ఎలా ఉంటుంది?" అని ప్రశ్నించారు.

ఆన్‌లైన్ ట్రోల్స్‌కు అభిషేక్ ఒక సవాల్ విసిరారు. "ఇంటర్నెట్‌లో అనే బదులు, దమ్ముంటే అదే మాటను నా ముఖం మీద చెప్పండి. అలా చెప్పే ధైర్యం వారికి ఎప్పటికీ ఉండదు. ఎవరైనా నా ముఖం మీదే చెబితే, వారిలో నిజాయితీ ఉందని భావించి గౌరవిస్తాను" అని అభిషేక్ స్పష్టం చేశారు.
Abhishek Bachchan
Aishwarya Rai
Abhishek Aishwarya divorce
Bollywood news
celebrity divorce rumors
online trolling
Sikandar Kher
Bollywood couples
Abhishek Bachchan interview
family impact

More Telugu News