Nara Lokesh: అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Announces Amaravati as South Asias First Quantum Valley
  • అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
  • 50కి పైగా యూనికార్న్‌ల‌ అభివృద్ధి 
  • చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ 
  • అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో మంత్రి నారా లోకేశ్‌
సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ కు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం. అమరావతి వర్క్ షాప్-2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు. దేశంలో ఓ కీలక మలుపు కానుంది. భవిష్యత్ లో రాబోయే సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోంది. 

అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం
అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మార్చాలనేది మా లక్ష్యం. ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలుగా, ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు. ఇది దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా నిలవబోతోంది. క్యూబిట్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు, ఆల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటమ్ ప్రమాణాల వరకు మేం పూర్తిస్థాయిలో క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన 156 క్యూబిట్లను కలిగిన ఐబీఎం క్యాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి రానుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. 

ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్‌బెడ్‌ను ఎన్పీఎల్, ఐఈఈఈ, సీయాక్, ఏడబ్ల్యూఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐబీఎం, టీసీఎస్, హెచ్ సీఎల్, టెక్ మహీంద్ర వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్యాంటమ్ స్టారప్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. ఈ కార్యాచరణకు వ్యూహాత్మక దూరదృష్టి ఉంది. ఇది ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్ కు అనుసంధానంగా, గ్లోబల్ భాగస్వామ్యాలతో నిర్మించడం జరుగుతుంది. ఐఐటీలు, ఐఐఎస్, టోక్యో యూనివర్సిటీల సహకారం తీసుకోవడం జరుగుతుంది.

చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ
సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ. చంద్రబాబు మొదటి చాప్టర్ ఐటీ అన్నప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. దక్షిణాసియా క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. సాఫ్ట్ వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీగా అమరావతి క్యాంటమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచపటంలో అమరావతి క్యాంటమ్ కు చోటు దక్కేలా కృషిచేద్దాం.

ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతుంది
సీఎం చంద్ర‌బాబు లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ, ఇన్నోవేషన్. గ్లోబల్ రేస్ లో చేరడం కాదు.. మనమే దారి చూపాలి. ఫలితంగా ఏపీ బ్రెయిన్ క్యాపిటల్ గా మారుతుంది. క్వాంటమ్ సైన్స్ ను ఇంజనీరింగ్ లోనూ భాగం చేస్తున్నాం. అమరావతిని క్యాంటమ్ టెక్నాలజీలకు కేంద్రంగా మారుస్తాం. ఇన్నోవేటివ్, స్టార్టప్ లకు ఈ క్యాంటమ్ వ్యాలీ పార్క్ ఓ లాంచ్ ప్యాడ్ అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రోడర్, టీసీఎస్ టెక్నాలజీ, స్టాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి.రాజన్న, ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అడ్వైజర్ ఎంవీ సతీశ్‌, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కే మధుమూర్తి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోఠి, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh
Amaravati
Quantum Valley
Andhra Pradesh
Chandrababu Naidu
Quantum Computing
Technology
IT Sector
South Asia
AP Brain Capital

More Telugu News