Etela Rajender: మీకు కళ్లు కనిపించడం లేదా?: రేవంత్ ప్రభుత్వంపై ఈటల ఫైర్

Etela Rajender Slams Telangana Govt Over HYDRA House Demolitions
  • జవహర్‌నగర్‌లో ఇళ్ల కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటోందని తీవ్ర విమర్శలు
  • బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ నేతల కబ్జాలను కాపాడుతున్నారని ఆరోపణ
నగరంలో ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జవహర్‌నగర్‌లో పర్యటించిన ఆయన, పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జవహర్‌నగర్‌లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. 30, 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవాడు ధనవంతుడా లేక నిరుపేదో ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. "చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటు. ముర్ఖుల్లారా.. మీకు కళ్లు కనబడటం లేదా?" అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదల బతుకుల్లో మట్టి కొట్టడం ద్వారా ప్రభుత్వానికి ఏం లభిస్తుందని ఆయన నిలదీశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఈటల సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్‌ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లు విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ అక్రమ కట్టడాలను, కబ్జాలను క్రమబద్ధీకరించేందుకే జీవో నెం.58, 59 తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు బడా నేతల కబ్జాలను కాపాడుతూ, మరోవైపు పూరి గుడిసెలను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

లంచాలు ఇవ్వని కారణంగానే అధికారులు గద్దల్లా వాలిపోయి పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని, వారి ఉసురు కచ్చితంగా తగులుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలని, నిరుపేదల విషయంలో తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Etela Rajender
Revanth Reddy
Telangana government
house demolitions
Jawahar Nagar
BJP leader
HYDRA
poor people
land grabbing
G.O. 58 59

More Telugu News