Chevireddy Bhaskar Reddy: మద్యం కేసు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మూడు రోజుల పోలీస్ కస్టడీ

Chevireddy Bhaskar Reddy Three Day Police Custody in Liquor Case
  • చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడు పోలీస్ కస్టడీ
  • విచారణ కోసం జులై 1 నుంచి 3 వరకు కోర్టు అనుమతి
  • ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసుల విచారణ
  • ఇదే కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం ఆయన్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరో నిందితుడు వెంకటేశ్ నాయుడుని మూడు రోజుల పాటు విచారించేందుకు పోలీసులకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. జులై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇటీవల సిట్ అధికారులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జులై 1 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియనుండటంతో పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది.

మ‌రోవైపు ఈ కేసులో 39వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. తండ్రికి పోలీస్ కస్టడీ ఖరారవడం, కుమారుడికి బెయిల్ నిరాకరణ కావడంతో ఈ కేసులో చెవిరెడ్డి కుటుంబానికి న్యాయస్థానంలో ఊరట లభించలేదు. సిట్ అధికారుల కస్టడీలో విచారణ పూర్తయితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Chevireddy Bhaskar Reddy
Andhra Pradesh
Liquor Scam
Vijayawada ACB Court
Mohit Reddy
Excise Case
AP Politics
Police Custody
SIT Investigation
Venkatesh Naidu

More Telugu News