Andhra Pradesh: కేతిరెడ్డిని తరలిస్తుండగా ఉద్రిక్తత.. తుపాకీతో కార్యకర్తలకు సీఐ వార్నింగ్

CI Sai Prasad Explains Gun Incident During Ketireddy Transfer in Tadipatri
  • తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో తీవ్ర ఉద్రిక్తత
  • శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ను అనంతపురం తరలించిన పోలీసులు
  • పోలీసు వాహనాన్ని వెంబడించి అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నం
  • కార్యకర్తలను చెదరగొట్టేందుకు తుపాకీ చూపించిన తాడిపత్రి సీఐ సాయిప్రసాద్
  • పెద్దారెడ్డి భద్రత కోసమే గన్ తీశానంటూ సీఐ వివరణ
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణులపై సీఐ తుపాకీ ఎక్కుపెట్టడం తీవ్ర కలకలం రేపింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు సీఐ తన సర్వీస్ రివాల్వర్‌తో హెచ్చరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే... ఆదివారం నాడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అకస్మాత్తుగా తాడిపత్రికి రావడంతో పట్టణంలో టెన్షన్ మొదలైంది. దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముందుజాగ్రత్త చర్యగా పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పెద్దారెడ్డిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెంబడించారు. పుట్లూరు మండలం కొండాపురం వద్దకు చేరుకోగానే పోలీసు వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ తన గన్‌ను బయటకు తీసి వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. వాహనానికి అడ్డు రావద్దని, వెనక్కి వెళ్లిపోవాలని గట్టిగా వారించారు.

సీఐ సాయిప్రసాద్ వివ‌ర‌ణ‌
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సీఐ సాయిప్రసాద్ వివరణ ఇచ్చారు. పోలీసుల కస్టడీలో ఉన్న పెద్దారెడ్డిపై ఎవరైనా దాడికి పాల్పడతారేమోనన్న అనుమానం వచ్చిందని, ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకునే గన్ తీసి హెచ్చరించినట్లు తెలిపారు. తమ వాహనాన్ని అడ్డగిస్తారేమోనన్న ఉద్దేశంతోనే వారిని చెదరగొట్టేందుకు అలా చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh
Ketireddy Pedda Reddy
Tadipatri
Anantapur
CI Sai Prasad
Police
YSRCP
Andhra Pradesh Politics
Political Tension
Gun Warning
Law and Order

More Telugu News