Pasamylaram fire accident: పాశమైలారం పేలుడు: 35కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Pasamylaram Fire Accident Death Toll Reaches 35
  • పాశమైలారంలో సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు
  • ప్రమాదంలో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ఎన్. గోవన్ దుర్మరణం
  •  శిథిలాల కింద మరికొందరు కార్మికులు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 35కు పెరిగింది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం  ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రియాక్టర్ పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే, ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా నేలమట్టం కాగా, సమీపంలోని మరో భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. సహాయక బృందాలు వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. మరోవైపు, తమ వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు తరలివచ్చిన కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం వద్ద హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి.


Pasamylaram fire accident
Sangareddy
Telangana
Sigachi Industries
fire accident
industrial accident
chemical factory blast
Damodar Rajanarsimha
Vivek
LN Gowan

More Telugu News