Ponguleti Srinivasa Reddy: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేని పని తెలంగాణలో చేస్తున్నాం: మంత్రి పొంగులేటి

Ponguleti Says Telangana Doing What BJP States Cant on Rice
  • దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్న మంత్రి పొంగులేటి
  • వరంగల్లు జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి
  • రాయపర్తి బహిరంగ సభలో బీఆర్ఎస్‌పై విమర్శలు 
దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం ఇవ్వడం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి నిన్న వరంగల్లు జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్ద పీట వేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేద వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చిందని, కానీ తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల మేలు కోసం భూభారతి చట్టం తీసుకువచ్చామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. 
Ponguleti Srinivasa Reddy
Telangana
Congress
Revanth Reddy
Fine rice
Ration cards
Rythu Bharosa
Indiramma Houses
Warangal
BRS
BJP

More Telugu News