Vishwambhara: 'విశ్వంభర'లో కనీవినీ ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్.. హాలీవుడ్‌ను తలదన్నేలా మెగా మూవీ!

Chiranjeevis Vishwambhara to Feature Unseen Visual Effects
  • మెగాస్టార్ 'విశ్వంభర'లో ఊహకందని స్థాయిలో వీఎఫ్ఎక్స్ షాట్లు
  • విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్న చిత్ర బృందం
  • పనిచేస్తున్న టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్
  • తుది దశకు చేరుకున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ కలల ప్రాజెక్టుగా రూపకల్పన
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుందని పరిశ్రమ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుపెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. 'విశ్వంభర' చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి వీఎఫ్ఎక్స్ స్టూడియోలు కలిసి పనిచేస్తున్నాయని సమాచారం. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత నాణ్యమైన విజువల్స్‌ను అందించాలనే లక్ష్యంతో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అద్భుతమైన కథనానికి అంతే స్థాయిలో సాంకేతిక హంగులు జోడించి, ఈ చిత్రాన్ని ఒక గొప్ప సినిమాగా మలుస్తున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

'బింబిసార' వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వశిష్ఠ, 'విశ్వంభర'ను తన కలల ప్రాజెక్టుగా భావించి తెరకెక్కిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది. దర్శకుడి ఆలోచనను తెరపై సంపూర్ణంగా ఆవిష్కరించేందుకు నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

పురాణ గాథలు, భావోద్వేగాలు, కళ్లు చెదిరే విజువల్స్‌తో 'విశ్వంభర' రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా, కునాల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక‌, సినిమా అవుట్‌పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Vishwambhara
Chiranjeevi
UV Creations
Trisha Krishnan
Ashika Ranganath
Vassishta
Telugu Movie
Visual Effects
VFX
Indian Cinema

More Telugu News