Kishan Reddy: పార్టీ అంతర్గత అంశాలపై స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy responds to internal party affairs
  • పార్టీకి కార్యకర్తలే నిజమైన బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఆరోపణ
  • మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని భారాస అప్పుల్లోకి నెట్టిందని విమర్శ
  • ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఫైర్
కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పార్టీ అంతర్గత అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. "రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా ఫర్వాలేదు. మన పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు, వాళ్లే మన బలం. నాయకత్వంలో ఎవరున్నా అందరూ ఐక్యంగా పనిచేయాలి" అని స్పష్టం చేశారు.

రామచందర్‌రావు నాయకత్వంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందరూ సమష్టిగా పని చేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మంగళవారం హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పాలన, అవినీతితో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాయని ఆరోపించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఏమీ చేయడం లేదని కొందరు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే సాధ్యమవుతున్నాయని తెలిపారు. ఈ నిజాన్ని విమర్శకులు గుర్తించాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం తామేనని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Kishan Reddy
BJP Telangana
Telangana politics
BJP president
BRS government

More Telugu News