Raja Singh: కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలపై రాజాసింగ్ స్పందన

Raja Singh Responds to Congress Joining Rumors
  • ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో చేరబోనని స్పష్టీకరణ
  • శివసేనలో చేరే అవకాశాలపై ఊహాగానాలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌లో చేరతారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందూత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలోనూ తాను చేరబోనని కుండబద్దలు కొట్టారు.

"కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం మీద ఏమాత్రం గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లను" అని ఆయన తేల్చిచెప్పారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వీరాభిమానినని, వారి కోసమే చివరి వరకు పనిచేస్తానని పేర్కొన్నారు.

మరోవైపు, రాజాసింగ్ తన హిందూత్వ ఎజెండాకే కట్టుబడి ఉంటానని చెప్పడంతో, అదే సిద్ధాంతాన్ని అనుసరించే శివసేన పార్టీలో చేరవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో కూడా రాజాసింగ్ శివసేనలో చేరి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తెలంగాణలో శివసేన పార్టీ నామమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వంటి బలమైన, ప్రజాదరణ ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని శివసేన నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజాసింగ్ అడుగులు శివసేన వైపు పడుతున్నాయని ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విషయంలో స్పష్టత ఇచ్చినప్పటికీ, ఆయన తదుపరి రాజకీయ గమ్యం ఏంటనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Raja Singh
Raja Singh BJP
Raja Singh Congress
Raja Singh BRS
Raja Singh Shiv Sena
Goshamahal MLA
Telangana Politics
Hinduism
Narendra Modi
Amit Shah

More Telugu News