Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ చూసి పవన్ ఫిదా.. దర్శకుడిని హత్తుకుని అభినందన

Pawan Kalyan Praises Hari Hara Veera Mallu Director Jyothi Krishna
  • రేపు ఉదయం 11:10 గంటలకు ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్‌
  • తాజాగా ట్రైలర్ చూసి ఎమోషనల్ అయిన పవన్ కల్యాణ్
  • దర్శకుడు జ్యోతికృష్ణను అభినందించిన పవర్ స్టార్
  • ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్‌ను వీక్షించిన పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చారిత్రక యాక్షన్ చిత్రం ట్రైలర్‌ విడుదల వివ‌రాల‌ను తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ ప్రకటనతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా పంచుకుంది. ఆ వీడియోలో పవన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను వీక్షిస్తూ కనిపించారు. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూసి పవన్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. వీడియో చివర్లో ఆయన దర్శకుడు జ్యోతికృష్ణ వద్దకు వెళ్లి, 'చాలా కష్టపడ్డావ్' అంటూ ఆయన్ను ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు. "తుపాను వెనక ఉండే శక్తి.. ట్రైలర్ చూశాక పవన్ కూడా తన ఉత్సాహాన్ని అదుపు చేయలేకపోయారు" అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ప‌వ‌న్‌ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందులో మొదటి భాగానికి ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ అనే పేరుతో వ‌స్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Krish Jagarlamudi
Jyothi Krishna
Nidhhi Agerwal
AM Ratnam
Telugu movie trailer
Action movie
Historical drama
Bobby Deol

More Telugu News