Aamir Khan: 'థగ్స్' హీరోయిన్ కోసం అన్ని కష్టాలా? అసలు విషయం చెప్పేసిన ఆమిర్ ఖాన్‌!

Aamir Khan Reveals Struggles Casting for Thugs of Hindostan
  • 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' హీరోయిన్ పాత్రను ఎవరూ ఒప్పుకోలేదని వెల్లడి
  • దీపిక, ఆలియా, శ్రద్ధా సహా ఇండస్ట్రీలో చాలామంది తిరస్కరణ‌
  • 'దంగల్' కూతురు ఫాతిమాతో రొమాన్స్ వద్దన్న‌ దర్శకనిర్మాతలు 
  • ప్రేక్షకులు అంత అమాయకులు కారని తాను వాదించానన్న ఆమిర్‌
  • సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్య
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం గురించి పలు ఆసక్తికర, సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ సినిమా కోసం హీరోయిన్‌ను వెతకడం ఎంత కష్టమైందో, చివరికి 'దంగల్' సినిమాలో తన కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్‌ను ఎంపిక చేయడానికి దర్శకనిర్మాతలు ఎంత వెనుకాడారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న వివరించారు.

అగ్ర హీరోయిన్లందరూ నో చెప్పారు
'ది లల్లన్‌టాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తాము పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమాలోని హీరోయిన్ పాత్రను అంగీకరించడానికి ఏ నాయికా ముందుకు రాలేదు. దీపికా పదుకొణె, ఆలియా భట్, శ్రద్ధా కపూర్.. ఇలా ఇండస్ట్రీలోని దాదాపు ప్రతీ హీరోయిన్‌కు ఆ అవకాశం ఇచ్చాం. కానీ ఎందుకో ఆ ఒక్క పాత్రకు ఎవరూ ఓకే చెప్పలేదు. ఇది అప్పట్లో నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య (విక్టర్)కు పెద్ద సమస్యగా మారింది" అని ఆమిర్ తెలిపారు.

కూతురితో రొమాన్స్ వద్దన్నారు
ఎవరూ అంగీకరించకపోవడంతో చివరికి దర్శకుడు విక్టర్.. ఫాతిమా సనా షేక్ వైపు మొగ్గు చూపారని ఆమిర్ అన్నారు. "ఫాతిమా టెస్ట్ షూట్‌లో బాగా చేసింది. ఆమెనే తీసుకుందాం అని ఆది, విక్టర్ నిర్ణయించుకున్నారు. కానీ, ఆమెతో నాకు రొమాంటిక్ సన్నివేశాలు వద్దని షరతు పెట్టారు. ఎందుకంటే 'దంగల్'లో ఆమె నా కూతురిగా నటించింది. ఇప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్‌గా నటిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారని వారు ఆందోళన చెందారు" అని ఆమిర్ వివరించారు.

అయితే, దర్శకనిర్మాతల వాదనతో తాను ఏకీభవించలేదని ఆమిర్ స్పష్టం చేశారు. "నేను ఇలాంటివి అస్సలు నమ్మను. నిజ జీవితంలో నేను ఆమెకు తండ్రిని కాదు, బాయ్‌ఫ్రెండ్‌నూ కాదు కదా. మనం కేవలం ఒక సినిమా చేస్తున్నాం. ప్రేక్షకులు అంత అమాయకులని మనం తక్కువ అంచనా వేస్తున్నాం" అని తాను వారితో వాదించినట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌ను ఉదాహరణగా చూపారు. "అమితాబ్ బచ్చన్ గారు రాఖీ గారికి ప్రేమికుడిగా, కొడుకుగా కూడా నటించారు. వహీదా రెహ్మాన్ జీతో కూడా అలాగే చేశారు. ఇది మన ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది" అని పేర్కొన్నారు.

ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పా
అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. సినిమా తుది ప్రతిని చూసినప్పుడే తనకు అనుమానం వచ్చిందని ఆమిర్ సంచలన విషయం బయటపెట్టారు. "సినిమా చూశాక నాకు షాక్ తగిలింది. ఇది అస్సలు వర్కౌట్ అవదని, ఒక్క రోజు కూడా ఆడదని నేను ఆది, విక్టర్‌తో చెప్పాను. మొదట నేను జోక్ చేస్తున్నానేమో అనుకున్నారు. కానీ వారు నా జోక్యాన్ని కోరుకోలేదు. దర్శకుడు, నిర్మాతగా తుది నిర్ణయం వాళ్లదే కాబట్టి నేను కూడా ఏమీ చేయలేకపోయాను" అని ఆమిర్ ఖాన్ ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
Aamir Khan
Thugs of Hindostan
Fatima Sana Shaikh
Bollywood
Aamir Khan Interview
Deepika Padukone
Alia Bhatt
Shraddha Kapoor
Aditya Chopra
Vijay Krishna Acharya

More Telugu News