Balakrishna: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో బాలయ్య.. విశ్వక్ సేన్ కోసం గెస్ట్ రోల్?

Nandamuri Balakrishna Guest Role in Ee Nagaraniki Emaindi Sequel
  • ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్ ప్రకటన
  • ‘ఈNఈ రిపీట్’ పేరుతో రానున్న కొత్త చిత్రం
  • పాత గ్యాంగ్‌తోనే మళ్లీ సందడి చేయనున్న నటులు
  • సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్ర అంటూ జోరుగా ప్రచారం
  • విశ్వక్ సేన్ కోరిక మేరకే బాలయ్య అంగీకరించారని గుసగుసలు
తెలుగు యువతను విపరీతంగా ఆకట్టుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించగా, దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఈNఈ రిపీట్’ పేరుతో రానున్న ఈ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారని సోష‌ల్ మీడియా వేదిక‌గా జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం యూత్‌లో మంచి గుర్తింపు ఉన్న చిత్రంగా నిలిచిపోయింది. దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ తరుణ్ భాస్కర్ ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే, ఈ సీక్వెల్‌లో నటసింహం బాలకృష్ణ నటించనున్నారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. నటుడు విష్వక్సేన్ కు బాలకృష్ణ అంటే విపరీతమైన అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానంతోనే విష్వక్ ఈ సినిమాలో నటించాలని బాలకృష్ణను వ్యక్తిగతంగా కోరగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

మొదటి భాగంలో నవ్వులు పూయించిన విష్వక్సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను ఈ సీక్వెల్‌లోనూ తమ పాత్రలను కొనసాగించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్‌ బాబు, సృజన్ యరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూర్చనున్నారు.

అయితే, బాలకృష్ణ నటిస్తున్నారన్న వార్తలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే, సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Balakrishna
Ee Nagaraniki Emaindi 2
Vishwak Sen
Tharun Bhascker
Suresh Productions
Telugu Movie
Tollywood
Vivek Sagar
Sai Sushanth Reddy
Abhinav Gomatam

More Telugu News