Bonda Uma: దమ్ముంటే ప్రజల్లోకి రండి: బొండా ఉమ

Bonda Uma Challenges YCP
  • 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ప్రారంభించిన బొండా ఉమ
  • కూటమి పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్య
  • వైసీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఎద్దేవా
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా, ఆయన నియోజకవర్గంలోని ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బొండా ఉమ తెలిపారు. నెల రోజుల పాటు నియోజకవర్గంలోని మొత్తం 267 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పర్యటించి, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటామని ఆయన వివరించారు. ఈ పర్యటనలో స్థానికంగా ఉన్న డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు సూచనలు జారీ చేశారు. కూటమి పాలనలో అంతా బాగుందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని ప్రజలు తమతో ఆనందం వ్యక్తం చేశారని ఉమ పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని బొండా ఉమ అన్నారు. "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని, స్త్రీ నిధిని ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి అమలు చేస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ. 240 కోట్లు కేటాయించాం. అధికారం ఉన్నా లేకపోయినా మేం ఎప్పుడూ ప్రజల వద్దకే వస్తాం. ఇప్పుడు 'మై టీడీపీ' యాప్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని వేగంగా పరిష్కరించేలా జవాబుదారీతనంతో పనిచేస్తాం" అని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో వైసీపీపై బొండా ఉమ తీవ్ర విమర్శలు చేశారు. "మా ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రస్తుతం వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీడియా ముందు విమర్శలు చేయడం కాదు, దమ్ముంటే ప్రజల వద్దకు వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. మా ప్రభుత్వం ఏ హామీని అమలు చేయలేదో ప్రజల ముందే చెప్పాలి" అని సవాల్ విసిరారు. అసలు హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది గత జగన్ ప్రభుత్వమేనని, కూటమి పాలన గురించి అడిగే నైతిక అర్హత కూడా వైసీపీకి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Bonda Uma
Bonda Umamaheshwara Rao
Vijayawada Central
TDP
Telugu Desam Party
Chandrababu Naidu
YCP criticism
Andhra Pradesh Politics
Praja Vedika
AP government schemes

More Telugu News