Bhaskar Tanna: గుజరాత్ హైకోర్టు వర్చువల్ విచారణ... తీరిగ్గా బీరు తాగుతూ కనిపించిన న్యాయవాది!

Bhaskar Tanna Caught Drinking Beer During Gujarat High Court Virtual Hearing
  • వర్చువల్ విచారణలో బీర్ తాగుతూ కనిపించిన సీనియర్ లాయర్
  • ఫోన్‌లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన న్యాయవాది భాస్కర్ తన్నా
  • లాయర్ ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన గుజరాత్ హైకోర్టు
  • సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని ఆదేశం
  • ఇలాంటివి ఉపేక్షిస్తే చట్టబద్ధ పాలనకు ముప్పని కోర్టు వ్యాఖ్య
  • రెండు వారాలకు విచారణ వాయిదా
కోర్టు విచారణ జరుగుతుండగా ఒక సీనియర్ న్యాయవాది ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. వర్చువల్ విచారణలో పాల్గొంటూ బీర్ తాగుతూ, ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించిన న్యాయవాదిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై సుమోటోగా (స్వయంగా) కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ఘటన న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

గుజరాత్ హైకోర్టులో సీనియర్ కౌన్సిల్‌గా ఉన్న భాస్కర్ తన్నా, జూన్ 25న జస్టిస్ సందీప్ భట్ ధర్మాసనం ముందు జరుగుతున్న ఒక వర్చువల్ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన బీర్ మగ్గుతో ఏదో పానీయం తాగుతూ, మరోవైపు తన ఫోన్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో క్లిప్ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

ఈ వీడియోను గమనించిన జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్‌టీ వచానిలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. న్యాయవాది తన్నా ప్రవర్తన అత్యంత దారుణంగా, ఘోరంగా ఉందని మండిపడింది. "న్యాయవాది ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే చట్టబద్ధమైన పాలనకు పెను విఘాతం కలుగుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వెంటనే స్పందించిన కోర్టు, న్యాయవాది భాస్కర్ తన్నాపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి నాడు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నివేదికను తదుపరి విచారణ నాటికి సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న కేసులో తదుపరి విచారణలకు వర్చువల్ పద్ధతిలో హాజరు కాకుండా తన్నాపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ కోర్టు ధిక్కరణ కేసు విచారణను రెండు వారాల తర్వాత చేపట్టనున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Bhaskar Tanna
Gujarat High Court
virtual hearing
court contempt
beer drinking lawyer
justice Sandeep Bhatt
justice AS Supehia
justice RT Vachhani
legal ethics
online court violation

More Telugu News