India: పాక్ సరిహద్దుల్లో అటాకింగ్ హెలికాప్టర్లను మోహరించనున్న భారత్!

India Deploys Apache AH 64E Attack Helicopters on Pakistan Border
  • పాక్ సరిహద్దులో మోహరించనున్న అపాచీ యుద్ద హెలికాఫ్టర్లు
  • అమెరికా నుండి ఈ నెలలో దిగుమతి కానున్న మూడు హెలికాఫ్టర్లు
  • 2020లోనే ఆరు హెలికాఫ్టర్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ ఒప్పందం
ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దుల్లో రక్షణను మరింత బలోపేతం చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ క్రమంలో అత్యాధునిక అపాచీ AH-64E అటాక్ హెలికాఫ్టర్లను పాకిస్థాన్ సరిహద్దులో మోహరించనుంది. ఈ మేరకు అమెరికాతో ఇదివరకే భారత్ ఒప్పందం చేసుకుంది.

అమెరికా తయారీ ఆధునిక యుద్ధ హెలికాఫ్టర్లు అపాచీ AH-64Eలు ఈ నెలలో భారత్‌కు చేరనున్నాయి. మొదటి విడతగా ఈ నెలలో మూడు హెలికాఫ్టర్లు భారత్‌కు రానున్నాయి. మిగిలిన మూడు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి.

మొత్తం ఆరు అపాచీల కోసం భారత్ 2020లోనే అమెరికాతో 600 మిలియన్ డాలర్లు (రూ.5 వేల కోట్లు) విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి గత ఏడాది మార్చి నెలలోనే ఈ యుద్ధ హెలికాఫ్టర్ల డెలివరీ పూర్తి కావాల్సి ఉండగా, పలు లాజిస్టిక్ కారణాల వల్ల ఆలస్యమైంది.

అపాచీ యుద్ధ హెలికాఫ్టర్ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. డబుల్ టర్బైన్ ఇంజిన్ ఉన్న ఈ హెలికాఫ్టర్లు అధిక ఎత్తులో కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. క్షిపణులు, రాకెట్లు, గన్ వంటి శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఇందులో ఉంటుంది. పగలు, రాత్రి ఆపరేషన్లలో కూడా సమర్థంగా పనిచేయగల సామర్థ్యం దీని సొంతం.

రియల్ టైమ్ టార్గెట్ ట్రాకింగ్, హైవిజన్ నైట్ విజన్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు శత్రు వాహనాలు, బంకర్లు, ట్యాంకులు వంటి వాటిని ధ్వంసం చేయగలదు. 
India
Apache AH-64E
Attack Helicopters
Pakistan Border
Operation Sindoor
Military
Defense
US Helicopters
Border Security

More Telugu News