Hyderabad Businessman: మ్యాట్రిమొనీ సైట్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో హైదరాబాద్ వ్యాపారవేత్తకు బురిడీ

Hyderabad Businessman Duped by Fake Matrimony Profile
  • హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తను భారీగా మోసం చేసిన కిలాడీ లేడీ 
  • పాకిస్థాన్ కు చెందిన ఫేమస్ నటిగా పరిచయం చేసుకున్న కిలాడీ లేడీ
  • రూ.22 లక్షలు కాజేసిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసిన కిలాడీ లేడీ
  • వ్యాపారి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి
మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఓ కిలాడీ లేడీ బురిడీ కొట్టించింది. అతని నుంచి దశలవారీగా రూ.22 లక్షలు కాజేసింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాట్రిమోనీ సైట్‌లో వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. దీనికి స్పందించిన ఓ మహిళ తాను పాకిస్థాన్‌కు చెందిన నటినని పరిచయం చేసుకుంది.

తన పేరు పర్వరిష్ షా అని, పాకిస్థాన్‌లో ప్రముఖ నటినని చెప్పుకొంది. తన వాట్సాప్ నంబర్‌ను కూడా వ్యాపారవేత్తతో పంచుకున్న ఆమె.. తన డీపీలో పాకిస్థాన్ నటి పర్వరిష్ షా ఫోటోను ఉంచింది. అంతేకాకుండా ఆ వ్యాపారవేత్తను నమ్మించేందుకు నటి పర్వరిష్ షా నటించిన సీరియల్స్, సినిమా వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది.

దీంతో తాను పాకిస్థాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వ్యాపారి ఊహల్లో తేలియాడటంతో పాటు ఈ విషయాన్ని తన స్నేహితులు, బంధువులతోనూ పంచుకున్నాడు. ఇదే క్రమంలో ఆమె సోదరినంటూ అనిషా ఎం హుండేకర్ అనే మహిళ కూడా ఈ వ్యాపారితో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ కలిసి ఆ వ్యాపారవేత్తను మాయమాటలతో బురిడీ కొట్టించారు.

కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని, రోడ్డు ప్రమాదాలు జరిగాయంటూ దశలవారీగా అతని దగ్గర నుంచి రూ.22 లక్షలు వసూలు చేశారు. అయితే, ఆ మహిళ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో వ్యాపారవేత్తకు అనుమానం వచ్చింది. 

దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కిలాడీ లేడీ అసలు పేరు ఫాతిమా అని తేలింది. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితురాలిని పట్టుకుని కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
Hyderabad Businessman
Matrimony fraud
Online Scam
Cyber Crime
Pakistan Actress
Fake Profile
Fatima
Bahadurpura

More Telugu News