Soham Parekh: ఒకేసారి నాలుగు ఉద్యోగాలు చేస్తున్న భారత టెక్కీ బండారం బట్టబయలు!

Indian Techie Soham Parekh Exposed in Silicon Valley Moonlighting Scam
  • ఒకేసారి పలు అమెరికన్ స్టార్టప్‌లలో ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డ సోహమ్ పరేఖ్
  • భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసాన్ని బయటపెట్టిన సుహైల్ దోషి
  • 'సోహమ్-గేట్' పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉదంతం
  • ఇంటర్వ్యూలలో అదరగొట్టి, చేరాక పనిలో విఫలమవుతున్న వైనం
  • రిమోట్ హైరింగ్ విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
  • తన కెరీర్ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసిన సోహమ్
సిలికాన్ వ్యాలీలో 'సోహమ్-గేట్' పేరుతో ఓ మూన్ లైటింగ్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. సోహమ్ పరేఖ్ అనే భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకేసారి పలు అమెరికన్ స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూ మోసానికి పాల్పడిన ఉదంతమిది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రిమోట్ వర్కింగ్ విధానాల్లోని లోపాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు సుహైల్ దోషి ఈ మోసాన్ని ఎక్స్ వేదికగా తొలిసారి బయటపెట్టారు. "సోహమ్ పరేఖ్ అనే వ్యక్తి ఏకకాలంలో మూడు నుంచి నాలుగు స్టార్టప్‌లలో పనిచేస్తూ వైసీ (YC) కంపెనీలను మోసం చేస్తున్నాడు. ఇతడిని మొదటి వారంలోనే పనిలోంచి తీసేశాను. అయినా అతను తన మోసాలు ఆపలేదు" అని దోషి వెల్లడించారు. ఈ ట్వీట్ తర్వాత, తాము కూడా సోహమ్ చేతిలో మోసపోయామంటూ పలు ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులు ముందుకు వచ్చారు.

సోహమ్ పరేఖ్ పనితీరు అన్ని కంపెనీలలో ఒకేలా ఉన్నట్టు తేలింది. ఇంటర్వ్యూలలో తన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో యాజమాన్యాలను సులభంగా ఆకట్టుకునేవాడు. కానీ, ఉద్యోగంలో చేరాక మాత్రం వేర్వేరు కంపెనీల పనుల వల్ల ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యేవాడు. "సోహమ్ ఏకకాలంలో నాలుగు కంటే ఎక్కువ స్టార్టప్‌లలో పనిచేస్తున్నాడు" అని ఫ్లీట్ ఏఐ సీఈఓ నికోలాయ్ ఓపోరోవ్ తెలిపారు. ఈ వివాదం బయటకు పొక్కగానే, చాలా కంపెనీలు సోహమ్‌కు ఇచ్చిన ఆఫర్లను రద్దు చేసుకున్నాయి.

ఈ ఉదంతం రిమోట్ వర్క్ వ్యవస్థలోని ఓ పెద్ద సమస్యకు అద్దం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని, ఇలా ఏకకాలంలో పలు ఉద్యోగాలు చేస్తూ లక్షల డాలర్లు సంపాదిస్తున్నామని చెప్పుకునే వారు ఆన్‌లైన్‌లో చాలా మంది ఉన్నారని ఇన్వెస్టర్ డీడీ దాస్ పేర్కొన్నారు. మరోవైపు, ఈ వివాదం తర్వాత సోహమ్ పరేఖ్ ప్రైవేట్‌గా స్పందిస్తూ, "నా కెరీర్‌ను పూర్తిగా నాశనం చేసుకున్నానా? ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నేనేం చేయాలి?" అని కొందరిని అడిగినట్టు తెలిసింది.
Soham Parekh
Silicon Valley
moonlighting
remote work
YC company
Mixpanel
Fleet AI
fraud
software engineer
multiple jobs

More Telugu News