Purandeswari: కమలం పార్టీకి మహిళా సారథి.. రేసులో పురందేశ్వరి, నిర్మల!

Purandeswari frontrunner for BJP National President post
  • బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి తొలిసారి మహిళను నియమించే అవకాశం
  • రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పురందేశ్వరి, వానతి శ్రీనివాసన్
  • మహిళా నేతృత్వానికి ఆర్ఎస్ఎస్ సానుకూలం!
  • జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిపై కసరత్తు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారిగా ఒక మహిళకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రతిపాదనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా మద్దతు తెలపడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.

ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2024 జూన్‌తో ముగిసిన నేపథ్యంలో, కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనాయకత్వం మహిళా నేత వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కీలక పదవి కోసం పలువురి పేర్లు పరిశీలనలో ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ప్రధానంగా రేసులో ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

నిర్మలా సీతారామన్‌కు కేంద్ర మంత్రిగా, పార్టీలో సీనియర్ నేతగా అపారమైన అనుభవం ఉంది. మరోవైపు, బహుభాషా కోవిదురాలైన పురందేశ్వరి నియామకం ద్వారా దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయవచ్చని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన వానతి శ్రీనివాసన్ పేరును కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు.

ఇటీవలి ఎన్నికల్లో మహిళా ఓటర్లు బీజేపీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుండటం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో, పార్టీ అత్యున్నత పదవిని మహిళకు ఇవ్వడం ద్వారా స్పష్టమైన సందేశం పంపాలని బీజేపీ వ్యూహాత్మకంగా యోచిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, బీజేపీ చరిత్రలో ఒక మహిళ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇదే ప్రథమం అవుతుంది.
Purandeswari
BJP president
Nirmala Sitharaman
BJP Mahila Morcha
Vanathi Srinivasan
BJP national president
RSS
BJP elections
women voters
political news

More Telugu News