Brijesh Solanki: కుక్కకాటుతో మరణించిన కబడ్డీ స్టార్

Dog Bite Turns Fatal Kabaddi Star Brijesh Solanki Dies
  • ప్రో కబడ్డీకి సిద్ధమవుతున్న యువ క్రీడాకారుడి మృతి
  • కాపాడిన కుక్కపిల్ల కాటుతో రేబిస్ సోకి విషాదం
  • గాయాన్ని నిర్లక్ష్యం చేయడంతోనే పోయిన ప్రాణం
  • కుక్క కరిస్తే వ్యాక్సిన్ తప్పనిసరి అంటున్న వైద్యులు
  • లక్షణాలు వచ్చాక రేబిస్‌ను నయం చేయడం అసాధ్యమని స్పష్టీకరణ
ప్రో కబడ్డీ లీగ్ (2026)లో సత్తా చాటాలని కలలు కన్న ఓ యువ క్రీడాకారుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్ బ్రిజేష్ సోలంకి, రేబిస్ వ్యాధితో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.   

కొన్ని వారాల క్రితం తాను రక్షించిన ఓ కుక్కపిల్ల కరవడమే ఆయన మరణానికి కారణమైంది. ఆ గాయాన్ని ఆటలో తగిలిన చిన్న దెబ్బగా భావించి బ్రిజేష్ నిర్లక్ష్యం చేశాడు. యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. సకాలంలో ఒక ఇంజెక్షన్ తీసుకుని ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదు.

ఈ ఘటనపై హైదరాబాద్, హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి. శివకుమార్ మాట్లాడుతూ రేబిస్ లక్షణాలు కనిపించాక ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యమని స్పష్టం చేశారు. "కుక్క లేదా ఏదైనా జంతువు కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే రేబిస్‌ను 100 శాతం నివారించవచ్చు. లక్షణాలు బయటపడ్డాక చికిత్సకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది" అని పేర్కొన్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కుక్క లేదా ఏదైనా జంతువు కరిచిన వెంటనే ఆ గాయాన్ని సబ్బు, నీటితో కనీసం 10-15 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలని డాక్టర్ శివకుమార్ సూచించారు. అనంతరం వెంటనే వైద్యులను సంప్రదించి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాలని నొక్కి చెప్పారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నా సరే, వ్యాక్సిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవాలని సూచించారు. 
Brijesh Solanki
Kabaddi player
Pro Kabaddi League
Rabies death
Dog bite
Anti-rabies vaccine
Uttar Pradesh
Care Hospitals
Dr Shiva Kumar
Hyderabad

More Telugu News