K Kavitha: ఎప్పటికైనా సీఎం అవుతా... బీఆర్ఎస్ లో అవమానాలు ఎదుర్కొంటున్నా: కవిత

K Kavitha Aims to be Telangana CM Despite BRS Challenges
  • కొత్త పార్టీ పెట్టేది లేదు, బీఆర్ఎస్ తనదేనని కవిత స్పష్టీకరణ
  • కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలను ఏరివేస్తేనే పార్టీకి మనుగడ అని వ్యాఖ్య
  • కేటీఆర్‌తో రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చిందన్న కవిత
రాజకీయాల్లో తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని, పదేళ్లు పట్టినా, ఇరవై ఏళ్లు పట్టినా ఆ ఆశయాన్ని నెరవేర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను కొత్త పార్టీ పెట్టబోనని, బీఆర్ఎస్ తన పార్టీ అని స్పష్టం చేస్తూనే, పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆసక్తిని కూడా ఆమె కనబరిచారు.

పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కవిత తీవ్రంగా స్పందించారు. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ కొందరు దెయ్యాలు చేరాయని, వారిని పార్టీ నుంచి ఏరివేస్తేనే బీఆర్ఎస్‌కు మనుగడ ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కొందరి వల్లే పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా తన ఓటమికి సొంత పార్టీ ఎమ్మెల్యేల సహకార లోపమే కారణమని కవిత ఆరోపించారు. కష్టకాలంలో, ముఖ్యంగా ఈడీ కేసు సమయంలో పార్టీ నుంచి తనకు తగినంత మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు, సోదరుడు కేటీఆర్‌కు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కానీ రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చిందని కవిత అంగీకరించారు. తాను కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చన్న ఆరోపణలపై మాట్లాడుతూ, కేసీఆర్ అలాంటివి చేయించరని, కింది స్థాయి అధికారులే చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పక అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. తన సామాజిక సంస్థ ‘జాగృతి’ని మళ్లీ అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేస్తానని, దాని కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తానని ఆమె తెలిపారు.
K Kavitha
Kalvakuntla Kavitha
BRS
Telangana politics
KCR
Telangana CM
BRS party internal affairs
Nizamabad MP
Telangana elections
Jagruthi

More Telugu News